Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకాశంలో అకస్మాత్తుగా ఎలాంటి శబ్దం లేకుండా, ఏ మాత్రం పొగ వదలకుండా.. గంటకు ఏకంగా 1,800 మైళ్ల వేగంతో దూసుకెళ్లే అంతుచిక్కని వస్తువులు కనిపిస్తే ఎలా ఉంటుంది? అదీ ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికా రహస్య సైనిక స్థావరాల పైభాగంలో ఈ వింత ఆకారాలు ప్రత్యక్షమైతే.. అది మామూలు విషయం కాదు! ఇప్పుడు అమెరికా ఆకాశంలో ప్రత్యక్షమైన బ్లాక్ ట్రయాంగిల్స్ ఆ దేశ ప్రభుత్వాన్ని, రక్షణ రంగాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ ‘బ్లాక్ ట్రయాంగిల్స్’ రహస్యం ఏంటి? అవి ఎక్కడి నుంచి వచ్చాయి.?
అమెరికా ప్రభుత్వం కొంతకాలంగా ఏలియన్స్ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా Unidentified Anomalous Phenomena – UAPకి సంబంధించిన డాక్యుమెంట్లను బయటపెట్టింది. ఇవి ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. గత ఏడాది కాలంలో అమెరికా రహస్య సైనిక స్థావరాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించే పర్వత ప్రాంతాల పైభాగంలో, నల్లటి త్రిభుజాకారంలో ఉన్న వింత వస్తువులు కనీసం మూడు సార్లు కనిపించినట్లు ఈ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఘటనలు జరిగిన ఖచ్చితమైన తేదీలు, ప్రాంతాల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
ఈ వింత వస్తువుల పనితీరు శాస్త్రవేత్తలను, సైనిక నిపుణులను నివ్వెరపరుస్తోంది. FBI నివేదిక ప్రకారం.. ఒక ప్రత్యేక సందర్భంలో ఈ వస్తువు కేవలం మూడు సెకన్లలో 1.5 మైళ్ల దూరాన్ని అధిగమించింది. దీన్ని బట్టి దాని వేగం గంటకు దాదాపు 1,800 మైళ్లు అంటే సుమారు 2,896 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఇది సాధారణ యుద్ధ విమానాల వేగానికి సమానం. ఇందులో గమనించదగ్గ మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఇవి ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి శబ్దం చేయలేదు. ఎలాంటి పొగ బయటకు వదలలేదు. విమానాలు, డ్రోన్లలో ఉన్నట్టు ఇంజిన్ల వద్ద కనిపించే వేడి భాగాలేవీ వీటిలో కనిపించలేదు. థర్మల్ పరికరాలతో స్కాన్ చేసినప్పుడు మాత్రం వాటి నుంచి ఒకే రకమైన, స్థిరమైన వేడి వెలువడినట్లు రికార్డులు చెబుతున్నాయి.
Also Read
ఈ త్రిభుజాకార వస్తువుల భౌతిక నిర్మాణం కూడా ఎంతో విచిత్రంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మెమోల సమాచారం ప్రకారం.. వీటి రెక్కల వెడల్పు 9 నుండి 15 అడుగుల వరకు ఉంది. లోతు 6 నుండి 9 అడుగుల వరకు, మందం 1 నుండి 2 అడుగుల వరకు ఉన్నట్లు అంచనా వేశారు. ఈ వింత వస్తువుల బాహ్య రూపం ఎంతో నునుపుగా, ఎలాంటి తెరుచుకునే భాగాలు లేకుండా ఉంది. వీటిలో విజిబుల్ ప్రొపల్షన్ ఓపెనింగ్స్, ఎయిర్ ఇంటేక్స్, ఏరోడైనమిక్ కంట్రోల్ సర్ఫేసెస్ లేదా కాక్‌పిట్ వంటి సాధారణ లక్షణాలేవీ కనిపించలేదు. వీటిని ప్రత్యక్షంగా చూసిన ఇద్దరు వ్యక్తులకు వైద్యపరీక్షలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో వారికి ఎలాంటి శారీరక ఇబ్బందులు తలెత్తలేదు. అంటే వికారం, తలనొప్పి, గందరగోళం, జ్ఞాపకశక్తి లోపించడం వంటి దుష్ప్రభావాలు కలగలేదు.
అత్యంత సున్నితమైన సైనిక స్థావరాలపై ఈ అంతుచిక్కని వస్తువులు సంచరించడం అమెరికా జాతీయ భద్రతకు పెను సవాలుగా మారింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఇవి అమెరికా సొంత సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన వస్తువులు కాదని అధికారులు స్పష్టం చేశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. ఇవి వేరే దేశానికి చెందిన రహస్య విమానాలై ఉండొచ్చా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భూమి మీద ఏ దేశం వద్దా ఇటువంటి అత్యాధునిక సామర్థ్యాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఆయా ప్రాంతాలు, తేదీలు ఇప్పటికీ Classified జాబితాలోనే ఉండటంతో స్వతంత్రంగా వీటిపై విచారణ జరపడం కష్టతరంగా మారింది.
UAPలకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టాలనే ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం మేరకు.. ఇప్పటి వరకూ ఏడు విడతల్లో ఈ ఫైల్స్‌ను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సంకేతాలు ఇస్తున్నారు. గతంలో కూడా మిలటరీ సిబ్బంది గమనించిన అనేక వింత వస్తువుల ఉదంతాలను బయటపెట్టారు. అయితే ఏ ఒక్కటి కూడా అవి అంతరిక్ష జీవులకు చెందినవని కచ్చితంగా నిరూపించలేకపోయాయి. ఇప్పుడు వెలుగు చూసిన ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ ఉదంతం కూడా అలాగే మిస్టరీగా మిగిలిపోయింది. ఇవి ప్రయోగాత్మక విమానాలా, విదేశీ సాంకేతిక పరిజ్ఞానమా, లేక మరేదైనా తెలియని శక్తా అనే ప్రశ్నలకు ప్రస్తుతానికైతే ఎలాంటి సమాధానం దొరకలేదు.
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మన కళ్లకు ఎదురుగా జరుగుతున్న కొన్ని వింతలు మాత్రం శాస్త్ర విజ్ఞానానికి కూడా అంతుచిక్కని సవాళ్లుగా మిగిలిపోతూనే ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ ట్రయాంగిల్స్ మిస్టరీ కూడా అంతే. నిజాలు ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి రాకమానవు. అప్పటివరకు మనం వెయిట్ చేయాల్సిందే!
:- CLN RAJU(EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
-
Jr NTR: త్రివిక్రమ్, తమన్లకు తారక్ క్లాస్.. అప్పట్లో జరిగిందిదేనట!
-
AP ZPTC Elections : ఎంపీటీసీ, జెడ్పీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా విడుదల
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?