Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనకు ఆకలేసినప్పుడు చిప్స్ తింటాం.. పని మధ్యలో టైమ్ లేకపోతే ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకుంటాం.. దాహమేస్తే కూల్ డ్రింక్ తాగుతాం. ఇవన్నీ మన రోజువారీ జీవితంలో చాలా సాధారణమైన విషయాలు. కానీ ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినేవాళ్ల మెదడులో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో తెలుసా?
కెనడాలో జరిగిన ఓ కొత్త అధ్యయనం ఇప్పుడు ఇదే విషయంపై ఆసక్తికరమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ ప్రభావానికి సంబంధించిన సంకేతాలు మరింత బలంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read
చిప్స్, ప్యాకెట్ స్నాక్స్, చక్కెర ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ సీరియల్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఇన్స్టంట్ నూడుల్స్, ఫ్రోజెన్ రెడీ టు ఈట్ మీల్స్.. ఇలాంటి ఆహారాలనే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. వీటిని తయారు చేసేటప్పుడు రుచి, రంగు, నిల్వ ఉండే సమయాన్ని పెంచేందుకు వివిధ పదార్థాలు వాడుతుంటారు.
వీటిని అప్పుడప్పుడు తినడం ఒక విషయం. కానీ రోజూ తినే ఆహారంలో ఎక్కువ భాగం ఇవే ఉంటే ఏం జరుగుతుందన్నది అసలు ప్రశ్న. కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 9 వేల మందిపై ఈ అధ్యయనం చేశారు. వీళ్ల వయసు 35 నుంచి 69 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరికి గతంలో గుండె సంబంధిత వ్యాధులు లేవు. వీళ్లు రోజూ ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనే వివరాలు సేకరించడంతో పాటు మెదడుకు ఎంఆర్ఐ స్కాన్లు కూడా చేశారు. ఆ స్కాన్లలో మెదడులో చిన్న చిన్న దెబ్బతిన్న ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అక్టోబర్ 15న జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ఓ విషయం బయటపడింది.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్లలో మెదడులో ఇలాంటి చిన్న చిన్న దెబ్బతిన్న ప్రాంతాలు కనిపించే అవకాశం, వాటిని తక్కువగా తినేవాళ్లతో పోలిస్తే 40 శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ మార్పులు ఉన్నవాళ్లకు వెంటనే ఏదో సమస్య వచ్చినట్టు అనిపించకపోవచ్చు.
జ్ఞాపకశక్తి బాగానే ఉండొచ్చు. రోజువారీ పనులన్నీ మామూలుగానే చేసుకోవచ్చు. కానీ మెదడులో ఇలాంటి మార్పులు భవిష్యత్తులో స్ట్రోక్ లేదా జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలకు ముందస్తు సంకేతాలు కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనంలో రోజూ తీసుకునే మొత్తం ఆహారంలో సగటున 25 శాతం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి. వీటిని ఎక్కువగా తినేవాళ్లలో ఈ వాటా ఏకంగా 45 శాతానికి చేరింది. తక్కువగా తినేవాళ్లలో మాత్రం అది 16 శాతమే. అంటే కొందరి రోజువారీ ఆహారంలో దాదాపు సగం ఇలాంటి ప్యాకెట్ ఫుడ్స్, రెడీ టు ఈట్ పదార్థాలే ఉంటున్నాయన్నమాట. మరో విషయం కూడా పరిశోధకులు గమనించారు.
ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినేవాళ్లు పండ్లు, కూరగాయలు, తక్కువ ప్రాసెసింగ్‌కు గురైన ధాన్యాలు లాంటి ఆహారాన్ని తక్కువగా తింటున్నారు. వీటిని తక్కువగా తినే వర్గంలో ఆరోగ్యకరమైన ఆహారం వాటా 68శాతం ఉంటే, ఎక్కువగా తినే వర్గంలో అది 41శాతానికే పరిమితమైంది.
అంటే ప్యాకెట్ ఫుడ్స్ తినడం పెరిగే కొద్దీ, వాటి స్థానంలో ఉండాల్సిన మంచి ఆహారం తగ్గిపోతోంది. మహిళల విషయంలో ఈ సంబంధం మరింత బలంగా కనిపించింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే మహిళల్లో, వాటిని తక్కువగా తినే మహిళలతో పోలిస్తే మెదడులో ఇలాంటి మార్పులు కనిపించే అవకాశం దాదాపు రెండింతలుగా ఉంది. అయితే ఈ ఫలితం ఆధారంగా ప్రతి మహిళకూ ఇదే జరుగుతుందని అనుకోకూడదు. ఇది అధ్యయనంలో కనిపించిన ఒక ముఖ్యమైన సంబంధం మాత్రమే. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినేవాళ్లలో పొట్ట లోపల అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వు కూడా ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ కొవ్వు శరీరంలో వాపును పెంచి, రక్తనాళాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. రక్తనాళాల సమస్యలు మెదడుపైనా ప్రభావం చూపవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ అధ్యయనం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్లే మెదడు దెబ్బతింటుందని నిరూపించలేదు. ఆహారపు అలవాట్లు, మెదడు స్కాన్ల మధ్య సంబంధాన్ని మాత్రమే గుర్తించింది. ఈ మార్పులు కాలక్రమంలో ఎలా పెరుగుతున్నాయి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే వాటిని తగ్గించవచ్చా అనే విషయాలు తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. కొంతమంది పాల్గొన్నవాళ్లకు మళ్లీ ఎంఆర్ఐ స్కాన్లు చేస్తున్నారు. వాటి ఫలితాలు 2028 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది. మరి మనం ఏం చేయాలి? రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలకు ఎక్కువ చోటివ్వాలి. ప్యాకెట్ స్నాక్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ఇన్స్టంట్ ఫుడ్స్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ప్రతి రోజూ ఇంట్లో వండుకుని తినడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయినా అందుబాటులో ఉన్నప్పుడు ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం, స్థానికంగా దొరికే తాజా పదార్థాలను ఉపయోగించడం లాంటి చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు.
ఎందుకంటే మనం తినే ఆహారం ప్రభావం బరువు దగ్గరే ఆగిపోదు. మన గుండెతో పాటు మెదడు ఆరోగ్యంతోనూ దానికి సంబంధం ఉండవచ్చు. ఆ మార్పులు బయటకు కనిపించే సమయానికి ముందే, మన శరీరంలో ఏం జరుగుతుందో ఈ అధ్యయనం ఆలోచించేలా చేస్తోంది.
తాజావార్తలు
-
Ultra-Processed Foods: మీరు తినే ఈ ఫుడ్‌తో బ్రెయిన్ డ్యామేజ్!
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!