Soil: మట్టి…! బంగారం కంటే ఎందుకు విలువైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాలిన ఆకులో మరో వసంతం దాగి ఉంది.. కరిగిపోయిన జీవంలో మరో జన్మ దాగి ఉంది. నిశ్శబ్దంగా కనిపించే నేలలో ఒక అనంత ప్రపంచం నిద్రిస్తోంది. ఆ ప్రపంచం ఊపిరితోనే భూమిపై జీవం కొనసాగుతోంది..మన కాళ్ల కింద పరుచుకున్న మట్టిని మనం ఎంత సాధారణంగా చూస్తామో కదా! అయితే ప్రకృతి సృష్టించిన అద్భుతమైన వ్యవస్థల్లో మట్టి ఒకటి.
ఒక గుప్పెడు మట్టిని చేతిలోకి తీసుకుంటే కనిపించేవి కొన్ని రేణువులే కానీ ఆ రేణువుల మధ్య కోట్లాది జీవుల సందడి ఉంటుంది. బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఆల్గే, ప్రోటోజోవా.. ఇలా అనేక సూక్ష్మజీవులు అక్కడ తమదైన ప్రపంచాన్ని నిర్మించుకుంటాయి. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ FAO ప్రకారం, ఒక్క గ్రాము ఆరోగ్యకరమైన మట్టిలోనే లక్షలాది సూక్ష్మజీవులు, వేలాది రకాల బ్యాక్టీరియా ఉండవచ్చు. భూమిపై ఇంతటి జీవ వైవిధ్యం మరే ఇతర ఆవాసంలోనూ ఇంత సాంద్రంగా కనిపించదు. అందుకే మట్టిని బంగారంతో పోల్చుతున్నారు సైంటిస్టులు.
Also Read
ఇంతకీ ఈ చిన్న జీవులు ఏం చేస్తుంటాయి? అడవిలో రాలిన ప్రతి ఆకు, నేలను చేరిన ప్రతి మొక్క అవశేషం వాటికి ఒక కొత్త పని అప్పగిస్తుంది. వాటిని విచ్ఛిన్నం చేస్తూ, అందులోని పోషకాలను తిరిగి ప్రకృతికి అందిస్తాయి. కొన్ని శిలీంధ్రాలు మొక్కల వేర్లతో అనుబంధాన్ని ఏర్పరుచుకుని నీరు, భాస్వరం లాంటి పోషకాలు అందేలా సహకరిస్తాయి. వానపాములు నేలలో దారులు చేస్తూ గాలి, నీరు లోపలికి వెళ్లేందుకు మార్గం కల్పిస్తాయి.
మన కంటికి కనిపించని ఈ జీవుల సమష్టి శ్రమతోనే ఒక విత్తనం మహావృక్షంగా ఎదిగే పునాది ఏర్పడుతుంది. ఈ నేల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు మనిషి శరీరంలోని గట్ మైక్రోబయోమ్‌తో పోల్చుతున్నారు. మన పేగుల్లో నివసించే సూక్ష్మజీవుల వైవిధ్యం జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. మనం తినే ఆహారం వాటి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే నేలలో ఏ పంటలు పండిస్తున్నాం, ఎంత వైవిధ్యమైన వృక్షజాలం ఉంది, సేంద్రియ పదార్థాలు ఎంత చేరుతున్నాయనే అంశాలు అక్కడి సూక్ష్మజీవుల సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. మన శరీర ఆరోగ్యానికి గట్ మైక్రోబయోమ్ ఎంత ముఖ్యమో, నేల ఆరోగ్యానికి దాని మైక్రోబయోమ్ కూడా అంతే కీలకం. అయితే భారత్‌లో నేల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
2025లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన అధ్యయనం ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య పరీక్షించిన సుమారు 1.3 కోట్ల మట్టి నమూనాల్లో 64 శాతం నత్రజని లోపంతో, 48.5 శాతం సేంద్రియ కర్బనం లోపంతో ఉన్నాయి. నేల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కేవలం రసాయన పోషకాలే సరిపోవని, అందులోని జీవ వైవిధ్యాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు.
అయితే మట్టి విలువ వ్యవసాయంతోనే ముగిసిపోదు. వాతావరణ మార్పులను నియంత్రించడంలోనూ దానికి కీలక పాత్ర ఉంది. మొక్కలు వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి, వాటి వేర్లు, ఆకుల అవశేషాల ద్వారా కొంత కర్బనాన్ని నేలకు చేరుస్తాయి. సూక్ష్మజీవులు ఆ కర్బనంలో కొంత భాగం నేలలో స్థిరపడే ప్రక్రియకు తోడ్పడతాయి. FAO అంచనాల ప్రకారం, భూమి పైభాగంలోని మొదటి 30 సెంటీమీటర్ల మట్టిలోనే వాతావరణం, వృక్షజాలం కలిపి ఉన్నదానికంటే ఎక్కువ కర్బనం నిల్వ ఉంది!
ఇంతటి సంపదను మోస్తున్న నేల గురించి మనకు తెలిసింది ఇంకా చాలా తక్కువ. దాని లోతుల్లో నివసించే జీవుల మధ్య ఎన్ని సంబంధాలు ఉన్నాయి? వాటిలో ఒక్కో జీవి ప్రకృతిని నిలబెట్టడంలో ఎలాంటి పాత్ర పోషిస్తోంది? శాస్త్రం ఇప్పటికీ ఆ రహస్యాలను విప్పుతూనే ఉంది. జీవాన్ని నిలబెట్టే ప్రతి జీవి మన కంటికి కనిపించాలని లేదు. భూమిపై మనుగడ సాగించడానికి ప్రతి అద్భుతం పెద్దదిగా, గొప్పగా కనిపించాల్సిన అవసరమూ లేదు. కొన్నిసార్లు అతి చిన్న జీవులే అత్యంత పెద్ద బాధ్యతను మోస్తుంటాయి. వాటి ఉనికిని గుర్తించడం, వాటి వైవిధ్యాన్ని కాపాడటం, జీవాన్ని నడిపిస్తున్న ఈ చిన్న జీవుల అద్భుతాన్ని సంబరంగా జరుపుకోవడం మన బాధ్యత.
ఇక బంగారం కోసం భూమిని తవ్వే మనిషి.. తన కాళ్ల కింద ఉన్న ఈ సంపదను కూడా గుర్తించాలి. ఎందుకంటే ఇది ఆహారానికి ఆధారం, జీవ వైవిధ్యానికి నిలయం, వాతావరణానికి సహజ రక్షణ. మన భవిష్యత్తును తనలో దాచుకున్న అపురూపమైన నిధి. నిజంగానే.. మట్టే బంగారం!
- Tags
- Explainers in Telugu
- Gold
- Soil
తాజావార్తలు
-
Soil: మట్టి…! బంగారం కంటే ఎందుకు విలువైంది?
-
Vivo X500 Series: వివో X500 Series ఇండియా లాంచ్ డేట్ వచ్చేసింది.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ
-
Suryakumar Yadav: బీజేపీలోకి సూర్యకుమార్? యాదవుల ఓట్లే టార్గెట్.. యూపీ ఎన్నికల్లో స్కై భార్యకు టికెట్?
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
AIMIM-ASP Alliance: యూపీ రాజకీయాల్లో సంచలనం.. కూటమిని ప్రకటించిన ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్!
ట్రెండింగ్
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..