Explainer: బంగాళాఖాతంలో పాగా వేయడానికి పాక్ కుట్రలు.. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల కథేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1971.. భారత రక్షణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంవత్సరం. ఆ యుద్ధంలో పాకిస్థాన్ దారుణంగా ఓడిపోయింది. బంగాళాఖాతంలో పాక్ ఉనికి పూర్తిగా కనుమరుగైంది. కానీ ఇప్పుడు దశాబ్దాల తర్వాత సీన్ మారుతోంది. బంగాళాఖాతంలో మళ్లీ పాగా వేయడానికి దాయాది దేశం కుట్రలు పన్నుతోంది. దీనికోసం చైనా సాయంతో ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. తన సరికొత్త హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. అసలు పాకిస్థాన్ వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్‌తో పెరుగుతున్న స్నేహం భారత్‌కు ఎలాంటి సవాళ్లు విసరబోతోంది? బంగాళాఖాతంలో ఆధిపత్యం కోసం ఏ దేశం ఎలా గేమ్ ఆడుతోంది.
హంగోర్ చరిత్ర ఏంటి?
హంగోర్.. ఈ పేరు వింటేనే చరిత్ర గుర్తుకొస్తుంది. 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధ సమయంలో.. పాక్‌కు చెందిన పీఎన్ఎస్ హంగోర్ సబ్ మెరైన్.. భారత నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ ఖుక్రీని ముంచేసింది. ఆ దాడిలో కెప్టెన్ మహేంద్రనాథ్ ముల్లాతో పాటు 176 మంది భారతీయ నావికులు వీరమరణం పొందారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యుద్ధ సమయంలో భారత నౌక మునిగిపోవడం అదే తొలిసారి. అయితే ఆ తర్వాత జరిగిన యుద్ధంలో భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించాయి. బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించాయి. ఆ దెబ్బతో బంగాళాఖాతంలో పాక్ ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు 55 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పేరుతో పాకిస్థాన్ పన్నాగం పన్నుతోంది. చైనాలో తయారైన సరికొత్త తొలి హంగోర్ క్లాస్ సబ్ మెరైన్.. ఏప్రిల్ లో కమిషన్ అయి.. ఇటీవలే కరాచీ చేరుకుంది. అరేబియా సముద్రాన్ని దాటి.. బంగాళాఖాతంలో తమ ఉనికిని చాటుకుంటామని పాక్ నావికాదళ అధికారులు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
Also Read
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Explainer: సొంత దేశస్తులనే కిడ్నాప్ చేసి హింసిస్తున్న భారతీయులు.. థాయ్‌లాండ్‌లో మానవత్వం మరిచిన ఇండియన్స్!
- Solar Eclipse: అజ్ఞానం రాసిన కథను.. విజ్ఞానం తిరగరాసింది.. సూర్యగ్రహణం వెనుక దాగిన నిజం!
- Lung Cancer: వంటగదిలో క్యాన్సర్ ముప్పు... మహిళలను నిండా ముంచుతున్న సంప్రదాయవాదులు ఆలోచనలు!
హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లు..ది గేమ్ ఛేంజర్:
1971 యుద్ధం తర్వాత పాకిస్థాన్ నావికాదళం కేవలం ఉత్తర అరేబియా సముద్రానికే పరిమితం అయింది. బంగాళాఖాతం భౌగోళికంగా వ్యూహాత్మకంగా భారత్‌కు ఒక బలమైన కంచుకోట. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళం… అండమాన్ నికోబార్ దీవులు భారత్‌కు ఇక్కడ తిరుగులేని ఆధిపత్యాన్ని ఇస్తున్నాయి. అయితే ఇటీవలే శ్రీలంక పర్యటనకు వచ్చిన పాక్ కమోడోర్ ఒమర్ ఫరూఖ్.. తమ కొత్త సబ్ మెరైన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. హంగోర్ క్లాస్ సబ్ మెరైన్ల రాకతో.. బంగాళాఖాతంలోకి ప్రవేశించే సామర్థ్యం పాకిస్థాన్‌కు వస్తుందని ఆయన చెప్పారు. ఇదొక గేమ్ ఛేంజర్ అని అభివర్ణించారు.
ఇలాంటివి మొత్తం 8 సబ్ మెరైన్లను పాక్ సిద్ధం చేస్తోంది. పాత అగోస్టా సబ్ మెరైన్ల స్థానంలో వీటిని తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. సముద్ర తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు ఆయా దేశాల ప్రాదేశిక జలాలు ఉంటాయి. 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ తర్వాత ఉన్న అంతర్జాతీయ జలాల్లో ఏ దేశ యుద్ధనౌకలైనా తిరగవచ్చు. ఇదే లూప్ హోల్ ను వాడుకుని బంగాళాఖాతంలో పాగా వేయాలని పాక్ చూస్తోంది.
బంగాళాఖాతంలో పాక్ ఇంత ధైర్యంగా వ్యూహాలు రచించడానికి బంగ్లాదేశ్‌లో మారిన రాజకీయ ముఖచిత్రమే కారణం. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో ఈ సముద్ర మార్గం వాణిజ్యపరంగా చాలా కీలకం. దశాబ్దాలుగా బంగ్లాదేశ్‌కు…పాకిస్థాన్‌కు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవి. కానీ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ముహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య స్నేహం బలపడింది. ఢాకా.. కరాచీ మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలయ్యాయి.
బంగ్లాదేశ్ విమానాలు భారత గగనతలాన్ని వాడుకుంటూనే పాక్‌కు వెళ్తున్నాయి. ఢాకా వర్సిటీలో ఉర్దూ షాయరీలు.. రాహత్ ఫతే అలీ ఖాన్ కచేరీలు జరుగుతున్నాయి. వాణిజ్యం కూడా భారీగా పెరిగింది. గతేడాది డిసెంబర్ నాటికి ఇరు దేశాల వాణిజ్యం 20 శాతం పెరిగింది. దాదాపు ఒక బిలియన్ డాలర్ల ఒప్పందాల దిశగా రెండు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఇక సైనిక సహకారం కూడా ఊహించని స్థాయిలో పెరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ పాకిస్థాన్ లో పర్యటించి.. జేఎఫ్-17 ఫైటర్ జెట్ల కొనుగోలుపై ఆసక్తి చూపించారు. ఆ తర్వాత అమాన్-25 నావికాదళ విన్యాసాల్లో ఇరు దేశాలు పాల్గొన్నాయి.
బంగ్లాదేశ్‌తో పెరుగుతున్న ఈ స్నేహం.. తూర్పు హిందూ మహాసముద్రంలో పాక్ నావికాదళ కార్యకలాపాలు పెరిగేలా చేస్తోంది. గతేడాది నవంబర్ లో పాక్ యుద్ధనౌక పీఎన్ఎస్ సైఫ్.. నాలుగు రోజుల పాటు చట్టోగ్రామ్ పోర్టులో బస చేసింది. 1971 తర్వాత పాక్ యుద్ధనౌక బంగ్లాదేశ్ కు వెళ్లడం ఇదే తొలిసారి. ఇంటెలిజెన్స్ షేరింగ్, డిఫెన్స్ అగ్రిమెంట్ల కోసం రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. పాకిస్థాన్ కొత్తగా తెస్తున్న హంగోర్ క్లాస్ సబ్ మెరైన్లలో ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంది.
సాధారణ సబ్ మెరైన్లు బ్యాటరీ ఛార్జింగ్ కోసం తరచూ నీటి పైకి రావాలి. కానీ ఇవి ఎక్కువ కాలం నీటి అడుగునే ఉండిపోతాయి. వీటిని పసిగట్టడం కష్టం. అయితే 1971తో పోలిస్తే భారత నేవీ ఇప్పుడు అత్యంత శక్తివంతంగా ఉంది. న్యూక్లియర్ సబ్ మెరైన్లు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మన సొంతం. అండమాన్ నికోబార్ దీవుల చుట్టూ భారత్ తన నావికాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోంది. కాబట్టి బంగాళాఖాతంలో పాకిస్థాన్ ఆటలు సాగకపోయినా.. వారి ఉనికి మాత్రం భారత్ కు ఒక చికాకుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!