Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి బద్దలైనంత శబ్దం… ఆకాశం విరిగి మీద పడ్డంత భయం… అప్పటివరకు నిద్రపోతున్న పల్లెలపైకి ఒకేసారి 10 కిలోమీటర్ల వెడల్పుతో దూసుకొచ్చిన మృత్యు జల ప్రవాహం. ఒకే రాత్రిలో ఏకంగా 62 డ్యామ్‌లు కుప్పకూలిపోయాయి. దాదాపు 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయానకమైన డ్యామ్ విపత్తు అది. కానీ, ఇంతటి ఘోరాన్ని ఒక దేశం ఏకంగా రెండు దశాబ్దాల పాటు బయటి ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా తొక్కిపెట్టింది. ఇప్పుడు నేపాల్‌లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఆకస్మిక వరదలు వందలాది మందిని బలిగొన్న వేళ, 1975 నాటి బాంకియావో మారణహోమం మరోసారి వెలుగులోకి వచ్చింది.
చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లవి. ప్రకృతిని సైతం కమ్యూనిస్టు శక్తితో జయించవచ్చని నిరూపించేంత పట్టుదల అప్పట్లో ఉండేది.
మావో జెడాంగ్ హయాంలో ‘హార్నెస్ ది హువాయ్ రివర్’ ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 1951-1952 మధ్య హెనాన్ ప్రావిన్స్‌లోని రూ నదిపై ‘బాంకియావో’ డ్యామ్‌ను నిర్మించారు. కొన్నేళ్లకే అందులో పగుళ్లు రావడంతో 1955-56లో సోవియట్ యూనియన్ ఇంజనీర్ల సాయంతో దానిని పునర్నిర్మించారు. ప్రపంచంలోనే ఎవరూ బద్దలు కొట్టలేని ‘ఐరన్ డ్యామ్’ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1958లో మావో చేపట్టిన ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్’ ఉద్యమంలో భాగంగా జుమడియన్ ప్రాంతంలోనే 100కు పైగా రిజర్వాయర్లను నిర్మించారు. ఆ సమయంలో సీనియర్ హైడ్రాలజిస్ట్ చెన్ జింగ్… “కేవలం నీటిని నిల్వ చేయడంపైనే దృష్టిపెట్టి, డ్రైనేజీని విస్మరిస్తే వినాశనం తప్పదు” అని హెచ్చరించినా, పాలకులు ఆయన్ను ‘రైట్-లీనింగ్ ఎర్రర్స్’ చేస్తున్నారంటూ పక్కనపెట్టారు.
Also Read
1975 జూలై చివరిలో పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ‘టైఫూన్ నినా’ తుఫాను తైవాన్ మీదుగా ఫుజియాన్ ప్రావిన్స్‌ను తాకింది. సాధారణంగా బలహీనపడాల్సిన తుఫాను, హెనాన్ వద్ద మరో వాయుగుండంతో కలిసి అసాధారణమైన తేమను మోసుకొచ్చింది. కేవలం మూడు రోజుల్లోనే ఏడాదికి సరిపడా వర్షపాతం నమోదైంది. లిన్ఝువాంగ్ ప్రాంతంలో ఆగస్టు 5 నుండి 7 వరకు అత్యధికంగా 1,605 మిల్లీమీటర్ల వర్షం కురవగా, బాంకియావో వద్ద 1,422 మిమీ వర్షపాతం నమోదైంది. బాంకియావో రిజర్వాయర్‌లోకి సెకనుకు 13వేల క్యూబిక్ మీటర్ల నీరు పోటెత్తింది. కానీ దాని గేట్ల నుంచి మాత్రం కేవలం సెకనుకు 1,700 క్యూబిక్ మీటర్లు మాత్రమే విడుదల చేసే సామర్థ్యం ఉంది. అంటే నిల్వ చేసుకునే వేగం కంటే నీరు లోపలికి వచ్చే వేగం దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంది.
ఈ భయానక సమయంలో అధికార యంత్రాంగం నిర్లిప్తత ప్రదర్శించింది. నిబంధనల ప్రకారం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సి ఉన్నా, ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక ఆదేశాలు రాకపోవడంతో అక్కడి సిబ్బంది నిర్ణయం తీసుకోలేకపోయారు. కనీసం సెకనుకు 450 క్యూబిక్ మీటర్ల నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా, కేవలం 300 క్యూబిక్ మీటర్లకే పరిమితం చేశారు. అంతలోనే టెలిఫోన్, రేడియో వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. సైన్యం పంపిన అత్యవసర సిగ్నల్ ఫ్లేర్లను ఎవరూ గుర్తించలేదు. కబురు అందించడానికి వెళ్లిన కొరియర్లు ప్రవాహంలో గల్లంతయ్యారు. షాహెడియన్ నగరానికి మాత్రమే గంట ముందు హెచ్చరిక చేరింది. అప్పటికే అక్కడ 827 మంది చనిపోయారు. ఇక ఎలాంటి హెచ్చరిక అందని పలు గ్రామాల్లో వేలాది మంది జలసమాధి అయ్యారు.
ఆగస్టు 7 అర్ధరాత్రి దాటిన కొద్ది నిమిషాలకే, బాంకియావో రక్షణ గోడపై నుంచి నీరు ఉప్పొంగి మట్టి కట్టను కోసేసింది. కొద్దిసేపటికే 701 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు సెకనుకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. 10 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు గల మహా ప్రవాహంగా దిగువకు విరుచుకుపడింది. బాంకియావోకు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిమంతాన్ డ్యామ్ అంతకుముందే తెగిపోగా, ఆ తర్వాత డొమినో తరహాలో మొత్తం 62 డ్యామ్‌లు ఒకదాని వెంట ఒకటి పేలిపోయాయి. కొన్ని రిజర్వాయర్లను కాపాడేందుకు మరికొన్ని డ్యామ్‌లను అధికారులే ఉద్దేశపూర్వకంగా పేల్చేశారు. ఆ ఒక్క రాత్రిలోనే 26,000 మంది నేరుగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.
వరద మిగిల్చిన విధ్వంసం అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు కొనసాగింది. బీజింగ్-గ్వాంగ్ఝౌ రైల్వే లైన్, రహదారులు తెగిపోవడంతో 10 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆగస్టు 13 నాటికి 20 లక్షల మంది నీటి మధ్య చిక్కుకుపోయి ప్రాణాల కోసం చెట్లపై వేలాడారు. ఆకలి తాళలేక చెట్ల ఆకులు, కీటకాలు తిని బతికారు. తీవ్రమైన ఎండ, కుళ్లిపోయిన మృతదేహాల వల్ల మెదడువాపు వంటి ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలాయి. ప్రిన్స్టన్-సింగువా విశ్వవిద్యాలయాల 2017 అధ్యయనం ప్రకారం ఆకలి, వ్యాధుల వల్ల మరో లక్ష మంది చనిపోయారు. హ్యూమన్ రైట్స్ వాచ్ 1995 నివేదిక ప్రకారం, త్రీ గార్జెస్ ప్రాజెక్టును వ్యతిరేకించిన ఎనిమిది మంది సీనియర్ చైనా నిపుణులు మొత్తం మరణాల సంఖ్య 2లక్షల 30 వేలు అని తేల్చారు.
అప్పట్లో సాంస్కృతిక విప్లవంలో ఉన్న చైనా ప్రభుత్వం ఈ మహా విషాదాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా పూర్తిగా తొక్కిపెట్టింది. ప్రభుత్వ పత్రికలు సహాయక చర్యల గురించిన ప్రచార వార్తలు మాత్రమే రాశాయి కానీ డ్యామ్ వైఫల్యాన్ని, మరణాలను దాచిపెట్టాయి. 1995లో హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ ఇచ్చే వరకు ఈ నిజాన్ని ప్రపంచం గుర్తించలేకపోయింది. అధికారిక పత్రాలు దాదాపు 30 ఏళ్ల పాటు అత్యంత రహస్యంగానే ఉండిపోయాయి. 1986 నుండి 1993 మధ్య బాంకియావో డ్యామ్‌ను మళ్లీ నిర్మించినప్పటికీ, చేసిన తప్పులను దాచిపెట్టే చైనా వైఖరి మాత్రం మారలేదు.
అసమర్థ ఇంజనీరింగ్ డిజైన్, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేని ప్రభుత్వ నిరంకుశ వ్యవస్థ, సమాచారాన్ని దాచిపెట్టే తత్వం ఎంతటి ఘోర విపత్తుకు దారితీస్తాయో చెప్పడానికి బాంకియావో దుర్ఘటనే నిదర్శనం. హిమాలయ పర్వత శ్రేణులలో చైనా నిర్మిస్తున్న భారీ ప్రాజెక్టులు, దిగువనున్న భారత్, నేపాల్ వంటి దేశాలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం లాంటి పరిణామాలు చూస్తుంటే… చరిత్ర నేర్పిన చేదు పాఠాలను బీజింగ్ ఇంకా గుర్తించలేదా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒక దేశం దాచే సమాచారం, సరిహద్దుల అవతల ఉన్న లక్షలాది మంది ప్రాణాలకు ముప్పుగా మారకూడదు.
:- CLN RAJU( EDITOR-NTV DIGITAL)
తాజావార్తలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!