Young Woman Commits Suicide By Jumping From Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి దూకి.. ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల సందర్శకులు చూస్తుండగానే.. ఆ అమ్మాయి దూకేసింది. తనతో పాటు తెచ్చుకున్న హ్యాండ్ బాగ్, చెప్పులు, చున్నీ వదిలేసి.. ఒక్కసారిగా చెరువులో దూకింది. వెంటనే అప్రమత్తమైన దుర్గం చెరువు పోలీసులు.. ఆ అమ్మాయి మృతదేహానికి వెతికి, బయటకు తీశారు. హ్యాండ్ బ్యాగ్ పరిశీలించగా.. ఆ అమ్మాయి పేరు స్వప్న అని తేలింది. అనారోగ్య సమస్యల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో ఆ అమ్మాయి చికిత్స పొందుతున్నట్టు.. బ్యాగ్‌లో లభ్యమైన డిస్క్రిప్షన్‌తో తేలింది.
అలాగే.. స్వప్న వయసు 23 ఏళ్లని, ఆమెకు కొంతకాలం కిందటే వివాహం అయినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. కుటుంబ కలహాల కారణంగా భర్తతో దూరంగా ఉంటోందని సమాచారం. ఓవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఉన్న ఈ ఇబ్బందుల్ని తాళలేక.. స్వప్న ఇలా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఇప్పటివరకూ మొత్తం 8 మంది ఆయా కారణాల వల్ల బ్రిడ్జ్‌పై నుంచి దూకి, ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా.. పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జ్‌ని సందర్శించడానికి వచ్చే టూరిస్టులపై ప్రత్యేక నిఘా పెడుతున్నారు.