పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపైనే ప్రేమించిన యువతి గొంతుకోసి పరారయ్యాడు.. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. రామగుండం 8ఎంక్లైన్ కేకే నగర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే కేకే నగర్ లో నివాసముంటున్న ఒక యువతిని ప్రేమ పేరుతో రాజు అనే యువకుడు వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని ఆమె వెనుక గత కొంతకాలంగా తిరుగుతుండగా.. ఆమె అతని ప్రేమను నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజు, కత్తితో యువతి గొంతుకోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని చుసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.