Live-In Partner: ఇటీవల కాలంలో సహజీవనాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ఢిల్లీలో గతేడాది శ్రద్ధావాకర్ హత్య యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. దీని తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు హత్యలకు గురయ్యారు. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో మహిళలు చాలా వరకు బాధితులుగా ఉన్నారు. అయితే, గురుగ్రామ్‌లో మరో లివ్-ఇన్ హత్య చోటు చేసుకుంది. ఈ సారి మాత్రం బాధితులు ఓ యువకుడు. సోదరుడి సహాయంలో ఓ యువతి తన లివ్ ఇన్ పార్ట్‌నర్‌ని చంపేసింది.
తన జీవిత భాగస్వామిని తలపై, మెడపై పాన్‌తో కొట్టి కిరాతంగా హత్య చేసింది. ఈ కేసులో మహిళను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. సదరు మహిళ తన సోదరుడు సాయంతో తిక్రీ గ్రామంలో హత్య చేసిందని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్ అశోక్ విహార్‌లో నివాసం ఉంటున్న నీతు అలియాస్ నిష్(34), విక్కీ(28) గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సదరు మహిళకు వివాహమై భర్త నుంచి విడిపోయిందని, ఆమెకు 15 ఏళ్ల పాప ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే సిరిసంపదలతో తులతూగుతుంది..
ఈ కేసులో సిటీ కోర్టు నీతూకి ఒక రోజు కస్టడీ విధించింది. మహిళ సోదరుడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి కచ్చి కాలనీలోని ఓ ఇంట్లో విక్కీ శవమై కనిపించాడు. వీక్కీని ఎవరో హత్య చేశారని అతని సోదరుడు ఫిర్యాదు చేశాడు. శనివారం సదర్ పోలీస్ స్టేషన్‌లో 302 (హత్య) మరియు 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇన్‌స్పెక్టర్ అర్జున్ దేవ్ నేతృత్వంలోని పోలీసు బృందం కేసును ఛేదించి ఆదివారం ఘటా గ్రామానికి చెందిన నీతును అరెస్టు చేసింది. ఆమె నుంచి విక్కీ మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి నీతూ, ఆమె సోదరుడు విక్కీ గదికి చేరుకున్నాడని, ఆమె సోదరుడు విక్కీ కలిసి మద్యం సేవించారని, ఆ తర్వాత వీరి మధ్య వాగ్వాదం జరిగిందని నిందితురాలు నీతూ వెల్లడించింది. ఇంతలో నీతూ విక్కీపై దాడికి పాల్పడింది. విక్కీ మెడ, తలపై గట్టి కొట్టడంతో అతను మరణించాడు. కేసును తప్పుదోవ పట్టించేందుకు నీతూ, విక్కీ మొబైల్‌తో పారిపోయింది.