ప్రస్తుతం తమిళనాడులో అన్నపూర్ణి అరసు మాతాజీ పేరు మారుమ్రోగిపోతుంది. కల్కి మాత తరువాత తానె అనుకుంటూ చెప్పుకు తిరుగుతున్న ఈ మాతాజీ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్ లోని ఓ కల్యాణ మండపం వేదికగా అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి ఒకటిన దివ్య దర్శనం ఇవ్వనున్నారని సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది. అయితే ఈ మాతాజీని చూస్తుంటే ఎప్పుడో ఎక్కడో చూసినట్లుందే అన్న అనుమానం ప్రజల్లోనే కాకుండా పోలీసులకు కూడా రావడంతో మాతాజీ గుట్టురట్టు చేసే పనిలో పడి విజయవంతం అయ్యారు చెన్నై పోలీసులు. గతంలో అనేక వివాదాలకు తెరలేపిన అన్నపూర్ణ అనే మహిళే ఇప్పుడు అన్నపూర్ణి అరసు మాతాజీగా ప్రత్యక్షమైందని పోలీసులు తెలిపారు.
భక్తి పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నదని తెలిపిన పోలీసులు ఆమె గతాన్ని తిరగతోడారు. గతంలో అన్నపూర్ణ అనే మహిళ అరుసు అనే వ్యక్తి మోజులో పడి భర్తను, కుమార్తెను వదిలి ప్రియుడితో పారిపోయింది. ఆ తరువాత ఎక్కడా ఆమె ఆచూకీ దొరకేలేదు. ఇన్నాళ్లకు ఆ అన్నపూర్ణే.. మాతాజీగా ప్రత్యక్షమయ్యింది. అంతేకాకుండా ప్రియుడు కూడా ఎప్పుడో మృతిచెందినట్లు పోలీసుల విచారణ లో తేలింది. దీంతో అమాయక ప్రజలను భక్తి పేరుతో మోసం చేస్తున్నందుకు, ప్రియుడు అనుమానాస్పద మృతి కేసులో నిందితురాలిగా ఉన్నందుకు పోలీసులు అన్నపూర్ణను అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అన్నపూర్ణ , ఆమె భక్తులు పరారయ్యారు. వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.