Woman Cheated With Fake Visas In Rajanna Siricilla: గల్ఫ్ కంట్రీస్‌లో ఏదో ఒక చిన్న పని చేసుకుంటే, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చని ఎందరో భావిస్తుంటారు. రెండు, మూడేళ్లు కష్టపడితే.. తమ సమస్యలు దూరమవ్వడంతో పాటు ఆ తర్వాతి జీవితాన్ని సుఖంగా గడపొచ్చని ఆశిస్తున్నారు. వారి ఆశనే కొందరు క్యాష్ చేసుకుంటూ.. భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఆయా దేశాలకు పంపిస్తామని చెప్పి, లక్షలకు లక్షలు కాజేస్తున్నారు. తీరా సమయం వచ్చాక, కంటికి కనిపించకుండా మాయమవుతారు. తాజాగా ఓ లేడీ కిలాడి కూడా ఇలాంటి మోసాలకే పాల్పడింది. గల్ఫ్ కంట్రీస్‌కి పంపిస్తానని అమాయకపు బాధితుల్ని నమ్మించి, భారీ డబ్బు దోచేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
రాజన్న సిరిసిల్లాలోని వేములవాడ పట్టణంలో ఒక లేడీ ఏజెంట్ నకిలీ వీసాల ఆఫీస్ నిర్వహించింది. తక్కువ ఖర్చులతోనే మలేషియాతో పాటు ఇతర గల్ఫ్ కంట్రీస్‌కి పంపిస్తానని నమ్మించింది. అక్కడ మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని, వేతనాలు కూడా ఎక్కువగా అందుతాయని నమ్మబలికింది. దీంతో.. సిద్ధిపేట, ఆర్మూర్, నిజామాబాద్‌లకు చెందిన కొందరు వ్యక్తులు ఆమెని సంప్రదించారు. ఆ కిలేడీ మాటలు నమ్మి లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. జనాలను నమ్మించడం కోసం.. కొందరికి మలేషియా నకిలీ వీసాలు, మరికొందరికి టూరిజం వీసాలు ఇచ్చింది. ఇంకొందరికేమో.. ఇంకా టైం పడుతుందని, కొన్నాళ్లు వేచి ఉండాలని సర్దిచెప్తూ వచ్చింది. రోజులు గడుస్తున్నా.. వారిని పంపించకుండా, ఏదో ఒక అబద్ధం చెప్తూ వచ్చింది.
ఫైనల్‌గా ఒక రోజు ఆ మహిళ ఏజెంట్ తమని మోసం చేస్తోందన్న విషయం జనాలకు తెలిసిపోయింది. టూరిజం వీసా, నకిలీ వీసాల వ్యవహారం బయటపడింది. తన బండారం బయటపడటంతో.. గుట్టుచప్పుడు కాకుండా ఆ కిలేడీ లక్షల డబ్బులు తీసుకొని ఉడాయించింది. మరోవైపు.. తాము మోసపోయామంటూ జనాలు మొరపెట్టుకుంటున్నారు. పరారైన ఆ మహిళను వెంటనే అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమ డబ్బులు తమకు వెనక్కు ఇప్పించేలా న్యాయం చేయాలని కోరుతున్నారు.