Crime News: విజయవాడలోని సింగ్ నగర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపడం లేదన్న కోపంతో అల్లుడు తన అత్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే.. సింగ్ నగర్‌కు చెందిన కోలా దుర్గను ఆమె అల్లుడు నాగసాయి భార్యను తనతో కాపురానికి పంపాలని కోరగా, అత్త ఇందుకు అంగీకరించకపోవడంతో తీవ్ర కోపానికి గురైన నాగసాయి అత్త ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కోలా దుర్గ తీవ్రంగా గాయపడగా, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also: Funny Cricket Moment: మ్యాచ్ మధ్యలో ఆటగాళ్లకు చుక్కలు చూపించిన అనుకోని అతిధి..
ఇక, నిందితుడు నాగసాయి స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, నాగసాయిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, నాగసాయిపై గతంలోనే అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనతో సింగ్ నగర్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.