Two Young Boys Robbed Retired Teacher in Jogipeta: ‘గురువు గారూ గురువు గారూ’ అంటూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడ్ని నిండా దోచేశారు ఇద్దరు యువకులు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపి, ఇంట్లో నుంచి రూ. 30 లక్షల నగదుతో పాటు 10 తులాల బంగారాన్ని దొంగలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ నారాయణ అనే రిటైర్డ్ టీచర్ ఎస్సీ బాలుర హాస్టల్ ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నారు. రెండు నెలల క్రితం మార్కెట్ యార్డ్ ఆవరణలో మద్యం సేవిస్తుండగా.. ఇద్దరు యువకులు ఆయన వద్దకు వచ్చారు. ‘గురువు గారు, బాగున్నారా? మమ్మల్ని గుర్తు పట్టారా? మేము మీ విద్యార్థులమే’నని మాట కలిపారు. ఆప్యాయంగా పలకరించడంతో.. ఆయన తన విద్యార్థులేమోనని అనుకున్నారు. ఆ తర్వాత కొన్నిసార్లు కలుసుకోవడం, మద్యం కూడా సేవించడంతో.. వారి మధ్య చనువు ఏర్పడింది.
కట్ చేస్తే.. ఈనెల 24న ఆ రిటైర్డ్ టీచర్ ఎప్పట్లాగే మార్కెట్ యార్డ్ వద్ద మద్యం సేవించేందుకు బయలుదేరారు. అయితే, అక్కడ దోమలున్నాయని చెప్పి ఆ యువకులు అన్నాసాగర్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు మద్యం సేవించారు. ఆయన్ను మద్యం మత్తులోకి దింపిన ఆ యువకులు.. ఇంకా మద్యం తీసుకొస్తామని చెప్పి ఆయన బైక్ తీసుకెళ్లారు. బైక్ తాళం చెవిగుత్తికే ఇంటి తాళం చెవి ఉండటంతో.. నేరుగా ఆ టీచర్ ఇంటికి వెళ్లారు. బీరువా తాళాన్ని పగలగొట్టి.. రూ. 30 లక్షల నగదు, 10 తులాలా బంగారు తీసుకొని వెళ్లిపోయారు. మరోవైపు.. సాయంత్రం 5 గంటలకు వెళ్లిన యువకులు, రాత్రి 8 అయినా రాకపోయేసరికి లక్ష్మీనారాయణ తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజు ఉదయమే 5 గంటలకు తన ఇంటికి వెళ్లారు. తీరా ఇంటికి చేరుకున్నాక, ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించారు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రిటైర్‌మెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇంటి స్థలం కొందామన్న ఉద్దేశంతో తాను డబ్బు దాచుకున్నానని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. రెండు నెలల క్రితం పరిచయమైన యువకులే ఈ పని చేశారన్నారు. తమది సంగారెడ్డి అని ఆ యువకులు చెప్పారని, కానీ పేర్లు మాత్రం వెల్లడించలేదన్నారు. రిటైర్డ్ టీచర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ కెమెరా ఫుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని తెలిపారు.