Disha Patani: బాలీవుడ్ నటి దిశాపటానీ ఇంటి ముందు కాల్పులు జరిపిన ఇద్దరు షూటర్లను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్) మంగళవారం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బరేలిలోని దిశా పటానీ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దర్ని అధికారులు కాల్చి చంపారు. నిందితులను రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర అలియాస్ కల్లు, హర్యానాలోని సోనిపట్ నివాసి అరుణ్‌లుగా గుర్తించారు. ఇద్దరూ రోహిత్ గోదారా-గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లో యాక్టివ్ మెంబర్లుగా ఉన్నారని, అనేక క్రిమినల్ కేసులు వీరిపై ఉన్నాయని పోలీసులు తెలిపారు.
Read Also: Dharmana Prasada Rao: కూటమి పాలన అంటూ ఏమీ లేదు.. ఆది కేవలం టీడీపీ పాలనే..!
సెప్టెంబర్ 12న తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో పటాని ఇంటి ముందు కాల్పుల సంఘటన జరిగింది. దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన ఏర్పడింది. దీనిపై బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నేరాల పట్ల జీరో-టాలరెన్స్ విధానంతో, వెంటనే కేసును ఛేదించాలని ఆదేశించారు.
షూటర్లను కనిపెట్టేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజ్, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రైమ్ రిపోర్టులను ఉపయోగించింది. ఎస్టీఎఫ్ నోయిబా, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ మంగళవారం నిర్వహించిన కాల్పుల్లో నిందితులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సంఘటనా స్థలం నుంచి గ్లోక్ పిస్టల్, జిగానా పిస్టల్, బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.