Kolkata: కోల్‌కతాలో మరో ఆర్జీకర్ లాంటి ఘటన జరిగింది. కస్బా లా కాలేజీలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం క్యాంపస్ లో ఈ ఘటన జరిగింది. గురువారం అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు, మరోకరిని కాలేజీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. గతేడాది కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను తాజా కేసు గుర్తు చేసింది.
నిందితుల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకుడు కూడా ఉన్నాడు. 24 ఏళ్ల బాధితురాలు పరీక్షలకు సంబంధించిన ఫామ్స్ నింపేందుకు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కాలేజీకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు ప్రకారం,ఆమె మొదట కాలేజీ యూనియన్ గదిలో కూర్చొంది. ఆ తర్వాత ప్రధాన నిందితుడు కాలేజ్ గేట్‌ని లాక్ చేయమని ఆదేశించాడు. క్యాంపస్ సెక్యూరిటీ గార్డు గదిలో ఆమెపై అత్యాచారం జరిగింది.
Read Also: CM Chandrababu: కమ్యూనిజం… సోషలిజం.. క్యాప్టిలిజం… అన్ని ఇజాలు పోయాయి.. టూరిజం ఒక్కటే మిగిలింది..!
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా FIR ప్రకారం, ప్రధాన నిందితులు తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (TMCP) దక్షిణ కోల్‌కతా జిల్లా మాజీ విద్యార్థి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి మోనోజిత్ మిశ్రా (31) గా గుర్తించారు. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జైబ్ అహ్మద్(19), మరో విద్యార్థి 20 ఏళ్ల ప్రమిత్ ముఖర్జీ నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో మిశ్రా, అహ్మద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు ముఖర్జీని గురువారం తెల్లవారుజామున అతడి ఇంటి నుంచి అరెస్ట్ చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాక్షుల వాంగ్మూలం రికార్డ్ చేశారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.
ఈ ఘటనపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. ఈ సంఘటనను భయంకరమైందిగా అభివర్ణించారు. ఇటీవల ఆర్జీకల్ హత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ.. బెంగాల్‌లో మహిళలపై నిరంతరం నేరాలు జరుగుతున్నాయని అధికార టీఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ప్రభుత్వం మహిళలకు పీడకలగా మారుస్తోందని దుయ్యబట్టారు. బాధితురాలికి అండగా బీజేపీ నిలుస్తుందని చెప్పారు. కోల్‌కతా మేయర్ ఫిర్హద్ హకీమ్ మాట్లాడుతూ.. తనకు ఈ ఘటన గురించి తెలియదని, పోలీసులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు.
