Site icon NTV Telugu

Stock Market Trading Scam: స్టాక్ మార్కెట్‌ పేరుతో భారీ మోసం.. కోట్ల రూపాయలు లాగేశారు.. కానిస్టేబుళ్ల కీలక పాత్ర..!

Scam

Scam

Stock Market Trading Scam: నెల్లూరు జిల్లా కావలిలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో వివిధ వర్గాల ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా సంస్థ కార్యాలయానికి నిర్వాహకుడు రాకపోవడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు… దీంతో నిర్వాహకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డబ్బులు వసూళ్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు కీలకపాత్ర పోషించినట్టు తెలిసింది.

Read Also: Maha Kumbh Mela: నో వెహికల్ జోన్‌గా ఆదేశాలు.. ప్రయాగ్‌రాజ్‌ను ఖాళీ చేయిస్తున్న పోలీసులు

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని మర్రిచెట్టు గిరిజన కాలనీలో అనంతార్థ అసోసియేట్స్ పేరుతో గుంటూరుకు చెందిన మహమ్మద్ సుభానీ.. స్టాక్ మార్కెట్ కార్యాలయాన్ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇందులో స్థానికంగా ఉన్న 17 మందిని డైరెక్టర్లుగా చేర్చుకున్నారు. వ్యాపారంలో వచ్చిన లాభంలో వారి స్థాయిని బట్టి.. పర్సంటేజ్ ని నిర్ణయించాడు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై అవగాహన కల్పిస్తామని ప్రకటనలు ఇచ్చి పలువురు యువతీ.. యువకులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. శిక్షణలో భాగంగా వారిలో ఒకొకరి నుంచి పదివేల రూపాయలను పెట్టుబడిగా పెడతానని వసూలు చేసి.. నెల రోజుల్లోనే 13 వేలు ఇచ్చారు. దీంతో నమ్మకం కుదరడంతో శిక్షణకు వచ్చిన పలువురు తమ బంధుమిత్రుల ద్వారా కూడా డబ్బులు కట్టించారు. అంతేగాక కావలి పరిసర ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని వివిధ వర్గాల ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు.. లక్ష రూపాయలకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకూ ప్రతిఫలాన్ని అందించారు.

Read Also: AP Government: మాదక ద్రవ్యాలపై యుద్ధం.. విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు..

ఇక, పెట్టిన డబ్బుకు అధికంగా ఆదాయం వస్తుండడంతో కొందరు ఉద్యోగులు.. వ్యాపారులు. పోలీసులు.. డబ్బులు కట్టారు. కావలికి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఏజెంట్లుగా వ్యవహరించి పలువురు నుంచి డబ్బులు వసూలు చేశారు. ఇలా చాలా వర్గాల నుంచి దాదాపు 50 కోట్ల రూపాయల వరకూ నగదును సమీకరించారు. గత కొద్ది రోజులుగా కార్యాలయానికి నిర్వహకుడు సుభానీ రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సుభానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు.. పూణే… మక్తల్… కాకినాడలలో కూడా ఇదే తరహా లో డబ్బులను సుభానీ వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం కార్యాలయానికి తాళం వేయడంతో
డబ్బులు చెల్లించిన వారు ఆందోళన చెందుతున్నారు. తాము కష్టపడి చెల్లించిన సొమ్ము తిరిగి వస్తుందో లేదోనని కలత చెందుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పై విచారణ చేస్తున్నామని.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Exit mobile version