Marriage: సోనమ్ రఘువంశీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయా తీసుకెళ్లి, కిరాయి హంతకులతో హత్య చేయించింది. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి ఘాతుకానికి తెగబడింది. అయితే, ఒక్క సోనమ్ ఘటనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో యువకులు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకువచ్చింది. ‘‘బతికుంటే ఎలాగొలా బతికేయొచ్చు, పెళ్లి చేసుకుని భార్య, ఆమె ప్రియుడి చేతిలో చావాలా..?’’ అనే ప్రశ్నలు యువకుల మదిలో వస్తున్నాయి. ఇప్పుడున్న జనరేషన్‌లో పెళ్లిళ్లు చేసుకోవడం కంటే సోలో బ్రతుకే సో బెటర్ అనే వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో అమ్మాయిల తల్లిదండ్రులు తమ కూతురికి మంచి భర్త రావాలని కోరుకునే పరిస్థితి నుంచి, ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రులు తమ కొడుకుకు మంచి భార్య రావాలని కోరుకునే పరిస్థితికి వచ్చింది.
ట్రెండ్ మారింది..
గతంలో, వరకట్నం వేధింపులతో భార్యల్ని టార్చర్ పెట్టడం, చంపేయడం వంటి ఘటనలు చూసేవాళ్లం.. ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి తర్వాత భర్తల్ని అత్యంత దారుణంగా హతమార్చే కల్చర్ మొదలైంది. చివరకు ప్రియుడి మోజులో పడి భర్త, పిల్లల్ని చంపుతున్న ఘటనలు సమాజాన్ని భయపెడుతున్నాయి. పెళ్లికి ముందు ప్రియుడు ఉండటం లేదా పెళ్లి తర్వాత వేరే వ్యక్తితో సంబంధాలు కొనసాగించేందుకు కొంతమంది మహిళలు హత్యలకు పాల్పడుతున్నారు. పెళ్లికి ముందు తన ఎఫైర్స్ గురించి దాచి పెట్టి, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను హతమార్చడం చూస్తుంటే ఒకింత భయపడేలా చేస్తోంది.
ఇదంతా ఒకెత్తు అయితే, మరికొంత మంది భర్తల్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారు. భార్యలు, వారి కుటుంబీకులు పెట్టే టార్చర్ భరించలేక ఆత్మహత్యలకు భర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కూడా పెరిగాయి. ఇటీవలి కాలంలో, భర్త అతడి కుటుంబంపై తప్పుడు గృహహింస వేధింపుల కేసు పెట్టడం, వారి నుంచి విడాకులు తీసుకుంటున్న సమయంలో పెద్ద మొత్తంలో ‘‘భరణం’’ వసూలు చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.
అత్యాశ కూడా కారణమే:
పెళ్లి చేసుకునే అమ్మాయి, వారి తల్లిదండ్రులకు పెరిగిన అత్యాశ వల్ల కూడా చాలా మంది పెళ్లంటేనే వెనుకడుగు వేస్తున్నారు. తమ అల్లుడికి లక్షల్లో ప్యాకేజీ ఉండాలి లేదా యూఎస్, యూకేలో సెటిల్ కావాలి, దీనికి తోడు కార్లు, భూములు, ఆస్తులు అదనం. ఇన్ని రిక్వైర్‌మెంట్లు ఉంటేనే పెళ్లికి ఒప్పుకుంటామనే యువతుల ధోరణి కూడా యువకుల్లో పెళ్లి పట్ల నిరాసక్తత పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. నేను సంపాదించి, నా సంపాదన మొత్తాన్ని వేరే మహిళ, ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి ఖర్చు చేయడం ఏంటని కొంతమంది యువకులు తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. అందుకే, నా సంపాదన నా ఇష్టం, పెళ్లి చేసుకోకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉంటున్నారు.
భయపెడుతున్న కొన్ని సంఘటనలు:
సోనమ్ రఘువంశీ కేసు: పెళ్లయి నెల రోజులు గడవక ముందే భర్తని దారుణంగా హత్య చేసింది సోనమ్. ప్రియుడు రాజ్ కుష్వాహా మోజులో పడిన సోనమ్, ఇద్దరు కలిసి ప్లాన్ చేసి హత్య చేశారు. దాదాపు 10 రోజుల తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ముస్కాన్ రస్తోగి: ఈ ఏడాది ముస్కాన్ రస్తోగి కేసు కూడా సంచలనంగా మారింది. మీరట్‌కి చెందిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని తన ప్రియుడు సాహిల్ శుక్లాలతో కలిసి హత్య చేసింది. శరీర భాగాలను ముక్కలుగా చేసి ప్లాస్లిక్ డ్రమ్‌లో వేసి, సిమెంట్‌లో కప్పేసిన ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మరొక వ్యక్తితో ప్రేమలో పడిన ముస్కాన్ తన భర్తని హతమార్చింది.
అతుల్ సుభాష్ కేసు: బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ కేసు కూడా ఒక ఉదాహరణగా మారింది. భార్య వేధింపుల గురించి కన్నీటితో ఆయన చెప్పిన మాటలు చాలా మందిని బాధించాయి. తన భార్య నిఖితా సింఘానియా, అత్తమామలు పెట్టే వేధింపులు, నకిలీ గృహ హింస గురించి ఒక వీడియో చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హత్య దేశంలో కొందరు మహిళలు ఉద్దేశపూర్వకంగా పెడుతున్న నకిలీ గృహ హింస కేసుల్ని హైలెట్ చేసింది.
బీజేపీ రాజ్యసభ ఎంపీ ఎంపీ దినేశ్ శర్మ పార్లమెంట్‌లో సుభాష్ ఆత్మహత్యను లేవనెత్తాడు. చట్టాల దుర్వినియోగం పట్ల, తప్పుడు కేసులు పెడుతున్న మహిళల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాంటి హింస, దోపిడీ నుంచి పురుషులకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎంపీ అన్నారు.ఆత్మహత్యలకు సంబంధించిన ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను కూడా దినేశ్ శర్మ సభలో వెల్లడించారు. 2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం మంది అంటే మొత్తం 1,25,000 మంది పురుషులు కాగా, మహిళల సంఖ్య దాదాపు 47,000 అని ఆయన చెప్పారు.
ప్రగతి యాదవ్ కేసు: ఈ ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌కు ఔరయ్యలో జరిగిన దిలీప్ యాదవ్ హత్య సంచలనంగా మారింది. పెళ్లయిన 15 రోజులకే భార్య ప్రగతి యాదవ్, ఆమె ప్రియుడు అనురాగ్ అలియాస్ మనోజ్, కాంట్రాక్ట్ కిల్లర్‌ని నియమించుకుని హత్య చేయించారు.
పునీత్ ఖురానా ఆత్మహత్య: భార్య మానిక పహ్వా నుంచి నిరంతరం మానసిక హింస, అసమంజసమైన డిమాండ్ల కారణంగా ఢిల్లీకి చెందిన వుడ్ బాక్స్ కేఫ్ యాజమాని పునీత్ ఖురానా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తాను ఎదుర్కొన్న కష్టాలను వీడియోలో రికార్డ్ చేశాడు.
అమీన్‌పూర్ మర్డర్స్: ఈ ఏడాది సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒక మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ప్రియుడి మోజులో పడిన రజిత అనే మహిళ తన భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపాలని ప్లాన్ చేసింది. అయితే, భర్త చివరి నిమిషంలో బయటకు వెళ్లడంతో ముగ్గురు పిల్లలు చనిపోయారు. భర్త, పిల్లల్ని వదిలించుకుని తన పాఠశాల స్నేహతుడితో కలిసి వెళ్లిపోవాలని రజిత భావించింది.