ఎన్ని చదువులు చదువుకొని ఏమి ప్రయోజనం సంస్కారం లేకపోతే.. ఇంకా సమాజంలో ఆడపిల్లలపై వివక్ష పోలేదని కొన్ని సంఘటనలు చూస్తుంటే తెలుస్తోంది. ఇంకా ఆడపిల్ల పుట్టిందని భార్యను వేధిస్తున్న భర్తలకు కొదువే లేదు. తాజాగా ఒక ప్రబుద్దుడు కూడా వరుసగా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని భార్యను పుట్టింటికి పంపి, వదిలించుకోవాలని ప్రయత్నించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భార్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగిన ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని ఆర్యనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సందీప్‌కు.. ఆర్మూర్‌కు చెందిన సంధ్యతో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. మొదటి నుంచి సందీప్ కి ఆడపిల్లలు అంటే అస్సలు ఇష్టం లేదు. ఈ విషయాన్ని భార్యకు కూడా చెప్పాడు. అయితే వీరికి మొదటి సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. అప్పటినుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఇక ఈ వేధింపుల మధ్యనే సంధ్య రెండోసారి కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన సందీప్, ఇద్దరు ఆడపిల్లలేనే కన్నావని, పుట్టింటికి వెళ్లి ఒక్కొక్కరి పేరు మీద కోటి రూపాయలు తీసుకురావాలని భార్యను కొట్టి పుట్టింటికి పంపించేశాడు. దీంతో చేసేదేం లేక భార్య సంధ్య, భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ తెలుపుతూ ఇద్దరు పిల్లలతో భర్త ఇంటి ముందు ఆందోళన చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.