Software Employee Loses 46 Lakhs In Cyber Crime: అతడు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తానున్న స్థాయికి మంచి వేతనమే వస్తోంది. అయినా ఇంకా డబ్బు సంపాదించాలని ఆశించాడు. కానీ, అదే అతనికి శాపమైంది. పార్ట్ టైం జాబ్ చేసి మరింత డబ్బు పోగేసుకోవాలనుకున్న ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి, ఏకంగా రూ.46 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరికి తాను మోసపోయిన సంగతి గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమీన్‌పూర్ పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు. అతనికి జూన్ 28వ తేదీన పార్ట్ టైం జాబ్ అంటూ.. ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తక్కువ పని, ఎక్కువ వేతనం అని ఆ మెసేజ్‌లో రాసి ఉండటంతో.. ఆ టెక్కీ టెంప్ట్ అయ్యాడు. వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసి, తన వివరాల్ని నమోదు చేశాడు.
Ponguleti: మీరు ఇంటికి పోవడం పక్కా.. తెలంగాణలో వచ్చేది మేమే..!
అప్పుడు సైట్ నిర్వాహకుడి నుంచి ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి ఒక వాలెట్ ఐడీ వచ్చింది. తమ రూల్స్ ప్రకారం.. వాలెట్‌లో ముందుగా రూ.2 వేలు జమ చేస్తే, టాస్క్‌లు ఇస్తామని అందులో పేర్కొన్నారు. వాళ్లు చెప్పినట్టుగానే అతడు రూ.2 వేలు జమ చేయగా.. నిర్వాహకులు అతనికి టాస్క్‌లు ఇవ్వడం ప్రారంభించారు. అది చూసి అతడు సంబరపడిపోయాడు. ఈ పార్ట్‌టైం ఉద్యోగంతో, నాలుగు రాళ్లు వెనక్కు వేసుకోవచ్చని భావించాడు. తాను ఎంత ఎక్కువ అమౌంట్ అందులో జమ చేస్తే, అందుకు రెట్టింపు వస్తుందని ఆశించాడు. ఇంకేముంది.. వెంటనే అతగాడు తన భార్య నగలు అమ్మేశాడు, స్నేహితుల వద్ద అప్పు కూడా చేశాడు. జాబ్ నుంచి వచ్చే జీతాన్ని సైతం కలిపి.. మొత్తంగా రూ.46 లక్షలు 35 దఫాలుగా జమ చేశాడు. సైబర్ నేరగాళ్లు అతడు పెట్టిన నగదుని.. అతని వ్యాలెట్‌లో చూపించారు. దానికి కమీషన్ కూడా జోడించారు.
Road Accident: శ్రీకాళహస్తిలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఆ భారీ మొత్తాన్ని తిరిగి వెనక్కు తీసుకోవాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భావించాడు. సరిగ్గా అప్పుడే సైబర్ నేరగాళ్లు ప్లేటు తిప్పేశారు. అతడు ఎంత అడిగినా.. వాళ్ల నుంచి స్పందన రాలేదు. దీంతో.. తాను మోసపోయానని బాధితుడు గ్రహించాడు. వెంటనే పోలీసుల్ని సంప్రదించాడు. ఆ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన వివరాల్ని ఇచ్చి, తనకు జరిగిన మోసం ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.