వికారాబాద్ జిల్లా పీరంపల్లిలో తీవ్రం ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తులు మృతి చెందడంతో శవంతో డ్రైవర్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు బంధువులు. వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన దాదాపు 15మంది ఓ వ్యాన్ లో ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున పువ్వులు తీసుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతీరెడ్డి పల్లి గేటు దగ్గర టైర్ పేలీ వ్యాన్ బొల్తాకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆ వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారంతా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓలీవ్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. గాయపడిన వారిలో బందెయ్య, యాదయ్య అనే ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో బంధువులు ఆగ్రహంతో బందెయ్య శవాన్ని ఆసుపత్రి నుంచి డ్రైవర్ ఇంటికి తీసుకెళ్లి ఇంటిముందు శవాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు. బందెయ్య కుంటుంబానికి న్యాయం చేసేవరకు ఆందోళన విరమించేది లేదని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకుని ఆందోళన కారులను శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.