Pune: మహారాష్ట్రలోని పుణెలో 34 ఏళ్ల మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఓ అపార్ట్మెంట్‌లో ఉరివేసుకున్న స్థితిలో ఆమె కనిపించింది. పెళ్లయినప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రతీ దీపావళికి 10 తులాల బంగారం కట్నంగా ఇవ్వాలని వేధిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నేపథ్యంలో ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
మృతురాలిని పాయల్ జాంబ్రే పాటిల్‌గా గుర్తించారు. ఆమె గతంలో ఐటీ ఉద్యోగినిగా పనిచేసేవారని, తర్వాత ఉద్యోగం మానేశారని పోలీసులు తెలిపారు. ఆమెకు అక్షయ్ జాంబ్రే పాటిల్‌తో వివాహమైంది. ఈ ఇద్దరికి ఒక కుమార్తె ఉన్నారు. అయితే, పాయల్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్య చేసిన అత్తింటివారే ఉరివేశారని కుటుంబీకులు ఆరోపించారు. పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆత్మహత్యకు ప్రేరేపించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆదివారం పాయల్‌కు తన అత్తతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం అత్తింటివారు, పాయల్ బంధువులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో దంపతులు నివసించే ఇంటికి సమీపంలోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ గదిలో పాయల్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు వెల్లడించారు.
పాయల్‌ను హత్య చేసి ఉంటారని ఆమె మామయ్య ఆరోపించారు. భర్త, అత్తమామలే ఆమెను చంపి ఫ్లాట్‌లో ఉరివేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పాయల్ అత్త పెళ్లయినప్పటి నుంచి వేధించేదని, తాము రైతులమని, కరువు పరిస్తితి కారణంగా వెంటనే ఆ డిమాండ్ తీర్చలేకపోయామని చెప్పారు. వచ్చే ఏడాది బంగారం ఇస్తామని హామీ ఇచ్చామని చెప్పారు. ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో కూడా మగ బిడ్డకు జన్మనివ్వాలని వేధించారని పాయల్ కుటుంబీకులు ఆరోపించారు. పాయల్ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో, ఆ బిడ్డను మేము పట్టించుకోమని ఆమె అత్తమామలు చెప్పినట్లు పాయల్ కుటుంబీకులు వెల్లడించారు. ప్రస్తుతం స్వర్గేట్ పోలీసులు పాయల్ భర్త అక్షయ్, అత్తమామలపై కేసు నమోదు చేశారు. అక్షయ్‌ను అరెస్ట్ చేశారు. అత్తామామల కోసం గాలిస్తున్నారు.

