అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు. తమను ఎవరేం చేయలేరన్న అహంకారంతో రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు. సామాన్య ప్రజలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే తాజా ఘటన! సహాయం చేసిన వ్యక్తినే ఓ ఎస్సై విచక్షణారహితంగా కొట్టాడు. ఆ వ్యక్తి తప్పేం లేదు. ఒక సమస్యని పరిష్కరించి, కాస్త ఆలస్యంగా వచ్చాడంతే! దీంతో ఆలస్యంగా వస్తావా అంటూ.. ఆ వ్యక్తిపై ఎస్సై దాష్టీకానికి పాల్పడ్డాడు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి చౌటకూర్ మండలం శివ్యంపేటలో అర్థరాత్రి ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో, టిప్పర్ వాహనం డ్రైవర్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. టిప్పర్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు సహకరించాలని, ఘటనా స్థలం వద్దకు వచ్చిన స్థానికుల్ని ఎస్పై గణేష్ కోరాడు. పోలీసుల వినతి మేరకు.. నరసింహా రెడ్డి అనే స్థానికుడు టిప్పర్ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించేందుకు ముందుకొచ్చాడు.
అయితే.. స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో టిప్పర్ ఎయిర్ లాక్ అయ్యింది. దీంతో, రిపేర్ చేయించడానికి కాస్త సమయం పట్టింది. సమస్యని పరిష్కరించాక, టిప్పర్‌ని స్టేషన్‌కు తీసుకువెళ్ళాడు. సహాయం చేసిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పాల్సిందిపోయి.. ఆలస్యంగా వచ్చాడన్న నెపంతో ఆ వ్యక్తిని ఎస్సై చితకబాదాడు. కానిస్టేబుల్ కూడా ఎస్సైకి వంత పాడాడు. స్థానికంగా ఈ ఉదంతం కలకలం రేపుతోంది.