దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ( 12 ) ముఠా సభ్యలను వరంగల్ టాస్క్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు . ఈ ముఠా సభ్యుల నుండి దేశంలో వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్‌టాప్‌లు, 1 ఐపాడ్ , 2 ప్రింటర్లు , 5 సీపీయూలు , 25 నకిలీ రబ్బర్ స్టాంపులు , 2 ప్రింటర్ రోలర్స్ , 5 ప్రింటర్ కలర్స్ బాటిల్స్ , 1 లామినేషన్ మిషన్ , 12 సెల్‌ఫోన్‌లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు : దార అరుణ్ ( ప్రధాన నిందితుడు, 2. ఆకుల రవి అవినాష్ , 3. మామిడి శ్రీకాంత్ రెడ్డి ( కన్సల్టెన్సీ ) 4. అనందుల మహేష్ ( కన్సల్టెన్సీ ) 5. మీర్జా అక్తర్ అలీ బేగ్ , 6. మాదిశెట్టి సచిన్ ( కన్సల్టెన్సీ) 7. చిదాల సలోనీ అలియాస్ రాధ 8. పోగుల సుధాకర్ రెడ్డి , 9 మామిడి స్వాతి , 10 , బాలాజు శ్రీనాధ్ 11 . నల్లా ప్రణయ్ , 12. అంబటి ఉత్తమ్ కిరణ్ గాపోలీసులు పేర్కొన్నారు.
పరారీలో ఉన్న నిందితులు హైదరాబాద్‌కు చెందిన కాస శ్రీనివాస్ యాదవ్, కుందారపు కృష్ణా , నరిశెట్టి సురేందర్‌గా తెలిపారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుజోషి పూర్తి వివరాలను వెల్లడించారు. అరెస్టయిన నిందితుల్లో దార అరుణ్, ఆకుల రవి అవినాష్ ఇద్దరు ప్రధాన నిందితులని తెలిపారు. వీరికి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగివుండటంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ నెట్ సెంటర్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఈ నెట్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం తన జీవనానికి సరిపోకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవడం కోసం అడ్డదారులు వెతికారు. దీన్లో భాగంగానే ప్రధాన నిందితులిద్దరు తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో తొలిరోజుల్లో చిన్నచిన్న నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేవారని, ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం ద్వారా వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో వుండటంతో నిందితులు కావాల్సిన వ్యక్తులకు దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలు, డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అందజేసినట్టు తరుణ్ జోషి తెలిపారు.
ప్రధాన నిందితులు దార అరుణ్ , ఆకుల రవి అవినాష్ సహకారంతో హన్మకొండ, పరిధిలోని కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే వ్యక్తులు , విద్యార్థులకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా ఆయా కన్సల్టెన్సీ యాజమాన్యం తమ కావల్సిన విద్యాసంస్థలకు సంబంధించిన సర్టికెట్లను తయారు చేయాల్సిందిగా నిందితుడు దార అరుణజ్ , ఆకుల రవి అవినాష్ నుంచి కన్సెల్టెన్సీకి వచ్చిన వ్యక్తులను బురిడీ కొట్టించేవారన్నారు. వీరితో నకిలీ సర్టిఫికెట్లను కొనుగోలు చేపించి విద్యార్హత లేకున్నా విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసేవారనితెలిపారు.
ఈ ముఠా ఒక అడుగు ముందుకేసి కొన్ని విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందేందుకు కనీస మార్కులను కూడా వీరే ఒరిజినల్ సర్టిఫికేట్లలో దిద్దేవారన్నారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనే విద్యార్థులకు మొదటి ప్రయత్నంలోనే ఉతీర్ణులై ఉండాలనే నియమం పెట్టడంతో వీరు దీన్ని అనూకూలంగా మార్చుకుని ఫెయిలైనా విద్యార్థులను సైతం పాస్ చేసి నకిలీ సర్టిఫికెట్లను అందించేవారన్నారు. నకిలీ సర్టిఫికేట్లతో విదేశాలకు వెళ్లడానికి ఈ ముఠా ఒక లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు వసూలు చేసేవారన్నారు. ఈ ముఠా సభ్యులు తాము తయారు చేసి సర్టిఫికెట్లపై ఎవరికి అనుమానం రాకుండా నిందితులు విదేశాల నుండి సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమయిన కాగితాలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసేవారు .
ఈ వ్యవహారానికి సంబంధించి టాస్క్ ఫోర్స్‌కు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఇంచార్జ్ అదనపు డీపీసీ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠా కార్యకలపాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. దీన్లో భాగంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఒకే సమయంలో ఈ ముఠాకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు నిర్వహించడంతో నకీలీ సర్టిఫికెట్ల వ్యవహారం బయటపడింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్లు శ్రీనివాస్ , సంతోష్ , ఎస్ఐలు ప్రేమానందం . ప్రియదర్శిని , హెడ్ కానిస్టేబుల్ శ్యాంసుందర్, కానిస్టేబుళ్లు మహేందర్, సృజన్ , శ్రీనివాస్ , శ్రీకాంత్ , అలీ , డ్రైవర్ శ్రీనివాస్‌ను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు.