Nizamabad: మరో యువకుడిని పొట్టన పెట్టుకున్న బెట్టింగ్ యాప్

  • బెట్టింగ్ యాప్‌కు బానిసై యువకుడి ఆత్మహత్య
  • అప్పుల బాధతో తీవ్ర మనస్తాపం
  • తాకట్టు పెట్టిన బైక్.. చివరకు విషాదం
  • ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై పోలీసులు హెచ్చరిక
Betting App

Betting App

ఆన్‌లైన్ గేమింగ్ , బెట్టింగ్ యాప్‌లు నేటి యువతను పెడదారి పట్టిస్తూ, చివరకు వారి ప్రాణాలను హరిస్తున్నాయి. ఈ మత్తులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువకుడు, ఆ భారాన్ని మోయలేక అర్థాంతరంగా తనువు చాలించాడు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికంగా కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాకు చెందిన బదావత్ అరుణ్ అనే యువకుడు తెలంగాణ యూనివర్సిటీలో సప్లయర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా అరుణ్ ఆన్‌లైన్ గేమ్స్ , బెట్టింగ్ యాప్‌లకు బానిసయ్యాడు. సరదాగా మొదలైన ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా మారి, తన సంపాదన కంటే ఎక్కువ మొత్తంలో అప్పులు చేసే స్థాయికి చేరుకుంది.

Gautam Gambhir: “ఫస్ట్ బాల్‌కే సిక్స్ కొట్టాలనిపిస్తే కొట్టేయ్”.. అభిషేక్ ఫామ్‌పై గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

అప్పుల బాధ తీవ్రం కావడంతో అరుణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. రెండు రోజుల క్రితమే తన ద్విచక్ర వాహనాన్ని సైతం అప్పులు తీర్చేందుకు తాకట్టు పెట్టాడు. వాహనం ఎక్కడ ఉందని తల్లి ప్రశ్నించగా, తాకట్టు పెట్టినట్లు చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడం, మరోవైపు ఒత్తిడి పెరగడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరుణ్ మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని మిగిల్చింది. కేవలం తొమ్మిది నెలల క్రితమే అరుణ్ తండ్రి మరణించగా, ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కుగా ఉండాల్సిన కొడుకు కూడా ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ప్రాణాలు తీసుకోవడం ఆ తల్లిని కుంగదీసింది.

అరుణ్ తన స్నేహితుల వద్ద సుమారు రూ. 15,000 వరకు అప్పు చేసినట్లు సమాచారం అందుతోంది. ఒక చిన్న మొత్తం కోసం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ యాప్‌ల వల్ల యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఇలాంటి వ్యసనాల బారిన పడకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Gannavaram Tragedy: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. గన్నవరంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!