వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన డిజిటల్ ఇండియ ప్రైవేట్ లిమిటెడ్ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ స్కామ్‌లో అమిత్ మిశ్ర, విజయ్ ఠాకూర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు తేల్చారు. దొడ్డిదారిలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఈ ఫేక్ కంపెనీ పేరుతో స్కామ్‌కి పాల్పడ్డారని తెలిసింది. ఢిల్లీ నుంచి ఈ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. అంతర్జాతీయ పుస్లకాలు, నావెల్స్‌ని డిజిటల్ చేస్తున్నామని వెల్లడించింది. ప్రతి పేజీకి ఐదు రూపాయలు చొప్పున పదివేల పేజీలకు భారీ మొత్తం ఇస్తామంటూ డిజిటల్ ఇండియా నమ్మబలికింది.
అయితే.. పేజీల స్కానింగ్ కోసం డిపాజిట్లు చెల్లించాలని ఆ సంస్థ డిమాండ్ పెట్టింది. డిపాజిట్ ఇచ్చేందుకు అంగీకరించిన వ్యక్తుల నుంచి లక్ష నుంచి ఐదు లక్షల దాకా వసూలు చేసింది. ఇలా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పుస్తకాల డిస్టలేషన్ పేరుతో రూ. 50 కోట్ల మేర సొమ్మును బాధితుల నుంచి కాజేసింది. అంతే, ఆ తర్వాత జెండా ఎత్తేసింది. మూడు నెలలు గడిచినా కంపెనీ నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు.. సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు.. ఈ స్కామ్ గుట్టుని రట్టు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ మిశ్ర, విజయ్ ఠాకూర్‌లే ప్రధాన నిందితులుగా తేలారు.