AP Fraud: నంద్యాల జిల్లా డోన్ ప్రాంతంలో ఒక రియల్టర్ కోట్లాది రూపాయలు అప్పులు చేసి అదృశ్యమయ్యారు. ప్రముఖ వ్యాపారులు, వైద్యులు, న్యాయవాదుల నుంచి భారీగా అప్పులు చేశారు. సక్రమంగా వడ్డీ చెల్లించడంతో మరింత అప్పులు ఇచ్చారు. లక్షల్లో మొదలై ఒక్కొక్కరు కోట్లల్లో అప్పులు ఇచ్చారు. గత నెల అక్టోబరు వరకు కూడా సక్రమంగా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లించినట్లు సమాచారం. తుగ్గలి మండలం మారేళ్లకు చెందిన ఆ రియల్టర్ డోన్ లో కాపురం ఉంటూ బెంగుళూరు, అంతపురం, గోవాలో భారీ ఎత్తున స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. రియల్టర్ వ్యాపారి తండ్రి ఓ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. స్థిరాస్తి వ్యాపారం విస్తరించేందుకు డోన్, మారేళ్ల, బెంగుళూరు, అంతపురం వంటి ప్రాంతాల్లో భారీగా అప్పులు చేశారు. అప్పులు ఇచ్చిన వారికి విదేశీ టూర్లు కూడా తీసుకెళ్లేవాడు.. విలువైన మద్యం పార్టీ ఇచ్చేవారు. అప్పులు ఇచ్చిన వారిలో చాలా వరకు బడాబాబులే. ఒక్కొక్కరు రూ.50 లక్షలు మొదలు రూ.10కోట్ల వరకు అప్పులు ఇచ్చారు. మొత్తం అప్పు రూ.300 కోట్ల వరకు చేసినట్టు అంచనా.
రూ.300 కోట్ల వరకు అప్పులు చేసిన రియల్టర్ సుమారు 15 రోజులుగా కనిపించడం లేదని సమాచారం. డోన్ లో ఉన్న ఇంటికి తాళం వేశారు. రియల్టర్, ఆయన తండ్రి, కుమారుడు కూడా కనిపించకుండా పోయారు. రియల్టర్ చిన్న కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. వందల కోట్లు అప్పులు చేసిన రియల్టర్ అమెరికాకు వెళ్లినట్టు భావిస్తున్నారు. పథకం ప్రకారం గోల్డ్ కార్డ్ కొనుగోలు చేసి అమెరికాకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, దుబాయ్, ఫిలిప్పీన్స్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల వీసాలు కూడానా రియల్టర్ కు ఉన్నాయని తెలుస్తోంది. స్థిరాస్తి ఆర్థిక సమస్యలతో తప్పించుకొని వెళ్ళారా… ఉద్దేశ్యపూర్వకంగా వందల కోట్లు అప్పులు చేసి దేశం విడిచి వెళ్ళారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్టర్ కు ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టు సమాచారం. అయితే ఆ ఆస్తులు బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. నవంబరు 18వ తేదీన అమెరికా వెళ్లి, అక్కడికి వెళ్లిన తర్వాత వారి మొబైల్ వాట్సప్ నెంబర్ పనిచేయడం లేదని సమాచారం.
15 ఏళ్ల క్రితం బెంగుళూరు కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టి అనంతపురం, కర్నూలు నగరాల్లోనూ బ్రాంచీలను, ఆఫీసులను ఏర్పాటుచేసి అక్కడ తన కంపెనీ ప్రతినిధులను నియమించి వ్యాపారాన్ని విస్తరించినట్టు సమాచారం. ఖరీదైన కార్లతో లబ్దిదారులను తీసుకెళ్లి తన వెంచర్లను చూపించేవారు.. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేవారు. ఇటీవల ఏకంగా 25 కుటుంబాలతో కలిపి ఫ్లైట్ కు బుక్ వేసి ఒక టూర్ ఏర్పాటుచేసినట్లు తెలిసింది. వడ్డీ నూటికి 3 రూపాయలతో ప్రారంభమై ఆ తరువాత రెండు రూపాయలకు తగ్గించినట్లు సమాచారం. ఆ రియల్టర్ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లలో తిరిగేవారని చెబుతారు. దాదాపు 7 ఖరీదైన కార్లు వున్నట్లు తెలిసింది. ఆ వాహనాలను ఈ మధ్యనే విక్రయించినట్టు సమాచారం. బెంగుళూరులో ఖరీదైన ఇల్లు ఉన్నట్టు తెలిసింది. విలాసవంతమైన జీవితం గడపడంతో అప్పులు ఇచ్చే వాళ్ళు మరీ మరీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
రియల్టర్ 300 కోట్ల వరకు అప్పు చేసి ఉడాయించినా ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం విశేషం. అప్పులు ఇచ్చిన వారిలో బంధువులు, స్నేహితులు ఎక్కువగా వున్నారు. ఇచ్చిన అప్పు తిరిగి వస్తుందో రాదో… అనవసరంగా బయటపడి పరువు పోగొట్టు కోవడం ఎందుకు అని మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. అప్పులు ఇచ్చిన వారికి ప్రామిసరీ నోట్లు, చెక్కులు ఇచ్చినట్టు తెలుస్తోంది. అంత మొత్తంలో అప్పులు చేసి ముఖం చాటేసినా ఏ ఒక్కరు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.