Site icon NTV Telugu

Rich Thief: ఈ దొంగ మామూలోడు కాదు.. ముంబైలో ఫ్లాట్, ఆడి కారు.. షాక్‌లో పోలీసులు!

Thief

Thief

Rich Thief: ఈ దొంగ మామూలోడు కాదండోయ్.. గుజరాత్ పోలీసులు ఇటీవల అనేక రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడిన ఓ దొంగను ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. గత నెలలో రోహిత్ కానుభాయ్ సోలంకి వాపిలో లక్ష రూపాయల చోరీ కేసులో పోలీసుల వలకు చిక్కాడు. అనంతరం విచారణలో ఆ కిలాడీ చెప్పిన విషయాలను విని పోలీసులు ఆశ్చర్యపోయారు. అయితే, 19 దొంగతనాలను అంగీకరించిన సోలంకి.. విలాసవంతమైన తన జీవనశైలిని దర్యాప్తులో వెల్లడించడంతో పోలీసులు షాక్‌కు గురికావాల్సి వచ్చింది.

రోహిత్ కానుభాయ్ సోలంకి ముంబైలోని ముంబ్రా ప్రాంతంలో కోటి రూపాయలకు పైగా విలువైన ఫ్లాట్‌లో నివసిస్తూ ఆడి కారు నడుపుతున్నట్లు పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. విచారణలో సోలంకి 19 దోపిడీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. వీటిలో వల్సాద్‌లో మూడు, సూరత్‌లో ఒకటి, పోర్‌బందర్‌లో ఒకటి, సెల్వాల్‌లో ఒకటి, తెలంగాణలో రెండు, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో రెండు, మహారాష్ట్రలో ఒకటి ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో మరో ఆరు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. అతనికి అనేక రాష్ట్రాల్లో నేరాల చరిత్ర ఉంది. ముస్లిం మహిళను పెళ్లి చేసుకునేందుకు సోలంకి తన పేరును అర్హాన్‌గా మార్చుకున్నట్లు కూడా పోలీసులకు తెలిసింది.

Read Also: Rahul Gandhi: పరిహారానికి, బీమాకి మధ్య తేడా తెలియదా.. మోడీ సర్కార్పై రాహుల్ ఫైర్

వల్సాద్ జిల్లా పోలీసులు కూడా సోలంకి నేరచరిత్ర గురించి విచారించారు. సోలంకి దొంగతనాలకు పాల్పడేందుకు విలాసవంతమైన హోటళ్లలో బస చేసి, ఫ్లైట్‌లో ప్రయాణించి, పగటిపూట హోటల్‌ ఉండి క్యాబ్‌లను బుక్ చేసుకునేవాడు. దొంగతనాలకు పథకం వేసేందుకు పగటిపూట సొసైటీల్లో నిఘా పెట్టేవాడు. నిందితుడు ముంబైలోని డ్యాన్స్ బార్‌లు, నైట్‌క్లబ్‌లలో పార్టీలు చేసుకుంటూ జల్సా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నెలకు రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తున్న రోహిత్ కానుభాయ్ సోలంకి డ్రగ్స్‌కు కూడా అలవాటు పడ్డాడని పోలీసులు వెల్లడించాడు.

Exit mobile version