Mother Killed Daughter For Loving Another Cast Boy In Tamilnadu: సినిమాల్లో చూపించినట్టుగా.. నిజ జీవితంలో ప్రేమకథలు అందంగా ఉండవు. ఎన్నో అడ్డంకులు, షరుతులు ఉంటాయి. కొందరు ఆస్తి-అంతస్తులు చూస్తే, మరికొందరు కులాల్ని చూస్తారు. తమ కులానికి చెందిన వారు కాకపోతే.. నిర్మొహమాటంగా ప్రేమను నిరాకరిస్తారు. కాదని మొండికేస్తే.. పరువు కోసం హత్యలు చేయడానికైనా వెనుకాడరు. ఇలాంటి దారుణ సంఘటనలు ఇప్పటివరకూ ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా మరో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని.. కన్న కూతురినే కిరాతకంగా చంపేసింది ఓ కసాయి తల్లి. ఆ వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా సివల్పేరి గ్రామంలో ఆరుముగ కని, పిచ్చయ్ దంపతులు నివసిస్తున్నారు. వీరికి అరుణ అనే కుమార్తె ఉంది. అరుణ స్థానికంగా నర్సింగ్ చదువుతోంది. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడగా.. అది కొన్నాళ్ల తర్వాత ప్రేమగా మారింది. అయితే.. కుమార్తె ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది. అబ్బాయి వేరే కులం వాడు కావడంతో.. అతనితో ప్రేమ వద్దని, దూరంగా ఉండాలని తల్లి హెచ్చరిస్తూ వచ్చింది. ఒకవేళ ప్రేమ పెళ్లి చేసుకోవాలంటే.. తమ కులం వాడినే ప్రేమించాలని చెప్పింది. అయితే.. కుమార్తె అందుకు ఒప్పుకోలేదు. తాను ఆ అబ్బాయిని మనసారా ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేస్తున్నానని మొండికేసింది. ఇలా తల్లికూతుళ్ల మధ్య కొంతకాలం వాగ్వాదం కొనసాగింది.
దీంతో.. ఒక రోజు తల్లి ఆరుముగ కనీ సడెన్‌గా అరుణకు తమ కులానికి చెందిన అబ్బాయితో పెళ్లిచూపులు ఏర్పాటు చేసింది. తల్లి చేసిన ఈ పనితో ఖంగుతిన్న అరుణ.. తాను ఏం తక్కువ తినలేదన్నట్టు ఆ పెళ్లి చూపుల సమయంలోనే అందరి ముందు తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పింది. పెళ్లిచూపులు రద్దయ్యాయి. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి.. అరుణని చంపేసింది. అనంతరం హెయిర్‌డై పౌడర్ తాగి.. తానూ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయం గమనించిన ఆమె భర్త.. వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అటు, కుమార్తె చనిపోయిన బాధతో రోదిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.