Crime: గుజరాత్‌లోని కచ్‌లో దారుణం జరిగింది. 27 ఏళ్ల వివాహిత, తన ప్రియుడితో పారిపోయేందుకు వేసిన ప్లాన్ వృద్ధుడి మరణానికి కారణమైంది. తాను ఆత్మహత్య చేసుకున్నానని కుటుంబసభ్యులను భ్రమింపచేయాలని వృద్ధుడిని ఈ జంట హత్య చేసి, దహనం చేసింది. నిజానికి చనిపోయిన వ్యక్తి అసలు ఎవరో వీరిద్దరికి తెలియదని, పారిపోతున్న క్రమంలో ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు.
రామి కేసరియా, అనిల్ గంగన్ అనే జంట ఒంటరిగా తిరుగుతున్న వ్యక్తిని చంపేసిన, ఆపై అతడి శరీరాన్ని కాల్చారు. జూలైలో నేరం జరిగితే మూడు నెలల తర్వాత వీరిద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామి, అనిల్ ఇద్దరు వృద్ధుడిని ప్రలోభపెట్టి హత్య చేసినట్లు తేలింది. రామి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందర్ని నమ్మిస్తే, తనకు ఎలాంటి సమస్యలు లేకుండా లవర్‌తో హాయిగా ఉండొచ్చని భావించిందని పోలీసులు తెలిపారు.
Read Also: Suicide: మాజీ కానిస్టేబుల్ ఆత్మహత్య.. తనను కేసులో ఇరికించిన వారి పేర్లు వీడియోలో వెల్లడి
రామి తన బట్టలు, ఫోన్, చెప్పులను కాలిపోతున్న శవం వద్ద వదిలిపెట్టింది. తద్వారా తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అందరూ నమ్మాలని భావించింది. జూలై 03న తమ ప్లాన్ అమలు పరిచిన కొద్దిసేపటికే గ్రామం వదిలి పారిపోయారు. అయితే, మరసటి రోజు అనిల్ వచ్చి రామి ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో గమనించాడు. సంఘటనా స్థలంలో దొరికిన బట్టలు, మొబైల్ ఫోన్, కాలిపోయిన మృతదేహం కనిపించడంతో ఆ శవం రామిదే అని అంతా అంగీకరించారు.
రెండు నెలల తర్వాత అనిల్, రామి కచ్‌కి తిరిగి వచ్చారు. ఒక గదిని అద్దెకు తీసుకుని జీవించారు. అయితే, తాము తప్పించుకునే ప్లాన్ విఫలమైందని గ్రహించారు. సెప్టెంబర్ 27న తమ నేరాన్ని అంగీకరించి క్షమాపణలు కోరేందుకు రామి తండ్రి వద్దకు తిరిగి వచ్చింది. అయితే, రామి తండ్రి వారి క్షమాపణలను తిరస్కరించి, కేసు వివరాలను పోలీసులకు చెప్పాడు. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. స్కెచ్ ద్వారా చనిపోయిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. విచారణలో ఇద్దరూ నేరాన్ని అంగీకరించారు. తాము మొదటి నుంచి ఈ కేసులో తప్పులను అనుమానించామని, సమగ్ర దర్యాప్తు తర్వాత విషయం వెలుగులోకి వచ్చిందని కచ్ ఎస్పీ వికాస్ నంద చెప్పారు.