రాజేంద్ర నగర్ లో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవపడిన భార్య క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో నివాసముంటున్న పార్వతి(35), సాయి కుమార్ దంపతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రేయ, తన్వికి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కలహాలు లేని వీరి కాపురంలో గతకొద్దిరోజుల నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి.
శుక్రవారం పెళ్లికి వెళ్లివచ్చిన తర్వాత కూడా వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం కూడా భర్తపై తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగిన పార్వతి భర్తపై కోపం పెంచుకొంది. భర్త బయటికి వెళ్ళగానే పిల్లలిద్దరికీ ఉరి వేసి చంపి, తాను ఆత్మహత్య చేసుకొంది. తన చావుకు కారణం భర్త వేధింపులే అంటూ గోడపై సూసైడ్ నోట్ రాసింది. “సాయి ఒక్క సైకో లాగా వ్యవహరిస్తున్నాడని, తాను ఎవరితోనైన మాట్లాడినా అనుమానిస్తున్నాడని, అక్క చెల్లెళ్లతో మాట్లాడేటప్పుడు కూడా సాయి ఇబ్బందులకు గురిచేశారని పేర్కొంది”. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
