Site icon NTV Telugu

Crypto : కరీంనగర్ క్రిప్టో గేమ్.. చివరికి ఎవరి చేతిలో లాభం..?

Crypto Currency

Crypto Currency

Crypto : కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

తీగలగుట్టపల్లికి చెందిన నున్సావత్ భాస్కర్ సెప్టెంబర్ 11న కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు పరిచయస్తుడైన మాజీ కార్పొరేటర్ సతీష్ “మెటా ఫండ్ క్రిప్టో” పేరుతో ఒక స్కీమ్‌లో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికాడని భాస్కర్ వివరించారు. ఈ హామీ నమ్మి మొదట రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టగా, మరికొందరిని తీసుకురావాలని చెప్పడంతో మరో 17 మందిని చేర్చారు. వారి నుండి మొత్తం రూ.1.20 కోట్లు సతీష్ వసూలు చేశాడు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు.

Teja Sajja : ప్రభాస్ ది గోల్డెన్ హార్ట్.. అడగ్గానే సాయం చేస్తాడు..

డబ్బులు అడిగిన బాధితులను సతీష్ బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు సతీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఈ వ్యవహారంలో మరో కొంతమంది నిందితులు ఉన్నారని భావించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లోకేష్ అనే మరో కీలక నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఈ క్రిప్టో మోసం కేసులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు, అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చాలామంది ఇప్పటికీ భయంతో ఫిర్యాదు చేయడం లేదని సమాచారం. ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారినట్టు పోలీసులు భావిస్తున్నారు. సతీష్ వద్ద నుండి ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని బ్యాంక్ అకౌంట్ వివరాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సతీష్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరుతున్నట్లు కరీంనగర్ రూరల్ పోలీసులు తెలిపారు.

BCCI President: బీసీసీఐ అధ్యక్షుడిగా హర్భజన్‌ సింగ్‌?.. టర్బోనేటర్ టు అడ్మినిస్ట్రేటర్!

Exit mobile version