Crime News: కొత్తగా పెళ్లైంది. సంతోషంగా నవ దంపతులు ఇద్దరూ యువతి ఇంటికి వచ్చారు. ఇంతలోనే చిన్న ఘర్షణ..తిరిగి ఇద్దరూ కలిసి తమ ఇంటికి వెళ్లిపోయారు. కానీ చిన్నగా ఏర్పడ్డ వివాదం కాస్తా.. క్షణికావేశంలో నవ వధువు ఆత్మహత్య చేసుకునే వరకు దారి తీసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఎర్దండిలో జరిగింది. చిన్న కారణంతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి సూసైడ్ చేసుకోవడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనలో అసలేం జరిగింది?
ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు గంగోత్రి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి స్వస్థలం. అక్కడే వడ్డెర కాలనీలో తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. ఐతే గంగోత్రి.. తన ఇంటి ఎదురుగానే ఉంటున్న సంతోష్‌ను ఇష్టపడింది. ఆరేళ్ల నుంచి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒక్కటి కావాలని అనుకున్నారు. చివరికి ఇరు వైపులా పెద్దలను ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు.
Insurance Murder: ఛీ..ఛీ.. ఇలా కూడా డబ్బు సంపాదిస్తారా? రూ. 5కోట్ల జీవితబీమా క్లైమ్ కోసం ఏకంగా..
నవ దంపతులకు దసరా తొలి పండుగ కావడంతో ఇద్దరూ కలిసి గంగోత్రి ఇంటికి వచ్చారు. పండగను సరదాగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఐతే దసరా రాజున దంపతులిద్దరూ గంగోత్రి తల్లి గారి ఇంటిలో భోజనాలు చేస్తున్న సమయంలో సంతోష్.. మన ఇంట్లో మటన్ తెస్తే తినని నువ్వు.. మీ ఇంట్లో చికెన్ ఎలా తింటున్నావని గంగోత్రిని ప్రశ్నించాడు. అది కాస్తా ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. ఈ సమయంలో గంగోత్రికి మటన్ అంటే ఇష్టం ఉండదని.. చికెన్ తింటుందని ఆమె కుటుంబం సర్ది చెప్పింది. అంతా ఆ గొడవ అక్కడితో సద్దుమణిగిందనుకున్నారు.
గొడవ జరిగిన తర్వాత ఇద్దరు కలిసి తిరిగి అత్తగారింటికి వెళ్లారు. అక్కడ మళ్లీ గొడవ జరిగిందో ఏమో తెలియదు కానీ.. గంగోత్రి అత్తగారింటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటనతో అంతా షాకయ్యారు. గొడవను మనసులో పెట్టుకుని తన కూతురును బలవంతంగా తీసుకు వెళ్లారని గంగోత్రి తల్లి శారద ఆరోపిస్తోంది. మరోవైపు ఆమె మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదని బంధువులు అంటున్నారు. మొత్తంగా ఆమె చనిపోవడం బాధాకరమని చెబుతున్నారు. ఆరు సంవత్సరాలు ప్రేమించి.. పెళ్లి చేసుకున్న తర్వాత 6 రోజులు కూడా కాపురం చేయక నవ వధువు సూసైడ్ చేసుకోవడం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.