Site icon NTV Telugu

Hyderabad Tragedy: వాళ్లేం తప్పు చేశారు..? కన్న బిడ్డలను చంపేస్తున్న తల్లిదండ్రులు..!

Hyd

Hyd

Hyderabad Tragedy: మా ఆయిష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లూ వర్ధిల్లు అని దీవించాల్సిన చేతులతోనే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. దాంపత్య జీవితంలో గొడవలు, కుటుంబ కలహాలు, అనారోగ్య కారణాలు, ఆర్ధిక సమస్యలు.. ఇలా కారణాలు ఏవైవా కావొచ్చు. పెద్ద వాళ్ల సమస్యలకు చిన్నారులు సమిధలవుతున్నారు.. నిజానికి పిల్లలకు ఒంట్లో కాస్తంత నలతగా ఉంటేనే కన్నవారు తీవ్రంగా కలవరపడిపోతారు! ఆడుకుంటూ పొరపాటున కింద పడ్డ బిడ్డకు చిన్నగాయమైతేనే విలవిల్లాడిపోతారు. అలాంటిది. కన్నబిడ్డల గొంతు నులిమి, వారికి విషం పెట్టి చంపేసేంత కర్కశత్వంగా మారుతున్నారు కొంత మంది పేరెంట్స్. తాజాగా హైదరాబాద్ బాలానగర్‌ పరిధిలోని పద్మానగర్‌లో ఇలాంటి విషాదమే జరిగింది. తన ఇద్దరు పిల్లలను హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. తన ఇద్దరు కవల పిల్లలను గొంతు నులిమి చంపి… తాను కూడా బిల్డింగ్‌ పై నుంచి చనిపోయింది..

READ MORE: Group 2 : గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త.. శిల్పకళావేదికలో నియామక పత్రాల కార్యక్రమం

ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన అనిల్‌ కుమార్‌, సాయి లక్ష్మికి నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. అనిల్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో.. హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. పెళ్లి తర్వాత సాయిలక్ష్మితో కలిసి బాలానగర్‌లోని పద్మానగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు దిగారు. రెండేళ్ల క్రితం వీళ్లకు కవల పిల్లలు పుట్టారు. ఓ బాబు, ఓ పాప. అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్ల కాపురంలో కలహాలు మొదలయ్యాయి. బాబుకు రెండేళ్ల వయసు వచ్చినా.. మాటలు రాకపోవడంతో స్పీచ్‌ థెరపీలో జాయిన్‌ చేశారు. పాప కూడా తరుచూ అనారోగ్యానికి గురవుతోంది. దీంతో… భార్యాభర్తల మధ్య గొడవలు షురూ అయ్యాయి. రోగిష్టి పిల్లలను కన్నావ్‌ అంటూ.. సాయిలక్ష్మిని నిత్యం దూషించేవాడు అనిల్‌. కన్న తండ్రి అయి ఉండి కూడా పిల్లలను కసురుకునేవాడు. సోమవారం ఉదయం ఉద్యోగానికి వెళ్లిన అనిల్‌.. సాయంత్రం ఇంటికి రాలేదు. తన అన్న ఇంటికి వెళ్లాడు. అన్న వదినతో కలిసి.. వైజాగ్‌లో ఓ ఫంక్షన్‌‌కు అటెండ్‌ అయ్యేందుకు ప్లాన్‌ చేశాడు. మరోవైపు పిల్లల పరిస్థితి.. రోజూ భర్త వేధింపుల కారణంగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయిలక్ష్మి తీవ్రంగా మానసిక వేదనకు గురైంది. ఏ కన్న తల్లి చేయని విధంగా ఘాతుకానికి పాల్పడింది. ఇద్దరు పిల్లల ముఖాలపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసింది. గొంతు నులిమి కిరాతకంగా హత్య చేసింది. ఆ తర్వాత బిల్డింగ్‌ మీదకు ఎక్కి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన అపార్ట్‌మెంట్‌ ఓనర్‌.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అదే ఏరియాలో ఉండే సాయిలక్ష్మి తండ్రికి, భర్త అనిల్‌‌కి కాల్‌ చేశాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు… ఇద్దరు పిల్లలు, సాయిలక్ష్మి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అనిల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు..

READ MORE: Premanand Maharaj: ప్రేమానంద్ మహారాజ్ కోలుకోవాలని మదీనాలో ప్రార్థించిన ముస్లిం వ్యక్తి.. (వీడియో)

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. హైదరాబాద్ హబ్సిగూడలో తమ ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నారు చంద్రశే ఖర్ రెడ్డి దంపతులు. ప్రైవేటు కాలేజ్ మాజీ లెక్చరర్ చంద్రశే ఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. తనతోపాటే ప్రాణాలు తీసుకోవాలని భార్యకూ చెప్పి ఒప్పించాడు. తాము చనిపోతే పిల్లలేమైపో తారోనన్న ఆందోళనతో.. వారిద్దరూ ఉరి వేసుకోవ డానికి ముందు. తమ 15 ఏళ్ల కుమార్తెను, పదేళ్ల కుమారుణ్ని కర్కశంగా చంపేశారు. మొన్నటికి మొన్న విజయవాడలో శ్రీనివాస్ అనే వైద్యుడు అప్పుల బాధ తట్టుకోలేక తల్లి, భార్యతో సహా తమ ఇద్దరు పిల్లల్ని పొట్టన పెట్టుకొని, ఆపై తాను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.. కడప జిల్లాకు చెందిన నాగేంద్ర తాను ఉరివేసుకుని చనిపోవడానికి ముందు భార్యా, పిల్లలను చంపేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వెంకటేశ్.. కన్నబిడ్డలన్న కనికరమైనా లేకుండా.. ఐదేళ్లలోపు బాబు, పాప ముఖంపై దిండు పెట్టి అదిమి, ఆపై భార్యను కడతేర్చి తాను కూడా తనువు చాలించాడు.. నిన్నటికి నిన్న కడపలో భార్య, కొడుకుతో కలిసి గూడ్స్ ట్రెయిన్ కింద పడి బలవన్మరణం చెందాడు శ్రీరాములు. రోజూ మద్యం తాగి గొడవ చేస్తున్నాడనే కారణంకో నానమ్మ సుబ్బమ్మ.. శ్రీరాములును మందలించింది. అంతే ఇంట్లో నుంచి భార్య శిరీష, కొడుకు రిత్విక్‌ను తీసుకుని వెళ్లిపోయి గూడ్స్ ట్రెయిన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అటు నానమ్మ కూడా గుండెపోటుతో చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనలోనూ అభం శుభం తెలియని చిన్నారి రిత్విక్‌ను పేరెంట్స్ తమ గొడవలకు బలి చేశారు.. ఇలా.. ఇటీవలికాలంలో జరిగిన వరుస ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఆర్థిక సమస్యలు, ట్రేడింగ్, బెట్టింగ్ లాంటి వ్యసనాలు, కుటుంబ కలహాలు వంటివి వారి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా పైకి కనిపించినా.. బలవంతంగా ఉసురు తీసుకునే స్వభావం వెనుక మానసిక రుగ్మతలే కారణం అంటున్నారు వైద్యులు.

Exit mobile version