Site icon NTV Telugu

HYD DRUGS ARREST: డెడ్ డ్రాప్.. అట్టర్ ఫ్లాప్..

Crime

Crime

HYD DRUGS ARREST: స్మగ్లర్లు తెలివిమీరిపోతున్నారు. పుష్ప రేంజ్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్లాన్ చేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమ దందాను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలాంటి ముఠాలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. ఒక రోజు కాకపోయినా మరో రోజైనా పట్టుకుంటున్నారు. తాజాగా కొత్త తరహాలో డ్రగ్స్ దందా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొండాపూర్‌లోని వెంకటరమణ రెసిడెన్సీపై దాడి చేసి అంతర్రాష్ట్ర స్థాయిలో కోకైన్‌ సరఫరా చేస్తున్న యువకుడితో పాటు అతనికి సహకరిస్తున్న ఇద్దరు వ్యాపారవేత్తలను అరెస్టు చేశారు. నగరంలోని ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు.ప్రధాన నిందితుడిని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వేగేశ్న మురళీ కృష్ణంరాజుగా గుర్తించారు. ప్రస్తుతం కొండాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనితో పాటు భూపతిరాజు చిరంజీవి వర్మ, రుద్రరాజు హేమంత్‌రాజు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారేని పోలీసులు తెలిపారు. ఐతే వారు డెడ్ డ్రాప్ పద్ధతిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.

Read Also: జీహెచ్‌ఎంసీ ‘MyCURE’ యాప్ లాంఛ్.. ఫిర్యాదులపై రియల్‌టైమ్ ట్రాకింగ్

డెడ్ డ్రాప్ విధానంలో సరుకును ఎక్కడో ఒకచోట వదిలిపెడతారు. దాన్ని తీసుకునే వ్యక్తి ఎవరో సరఫరాదారుకి తెలియదు. వదిలిన వ్యక్తి ఎవరో కొనుగోలు దారికి తెలియదు. అయినా సరుకు చేరాల్సిన చేతికి చేరిపోతుంది. డబ్బులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా మధ్యవర్తుల ఖాతాల మీదుగా సరైన చోటుకు చేరిపోతాయి. దీంతో నేరుగా సంప్రదింపులు లేకుండానే డ్రగ్స్‌ సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం డ్రగ్‌ పెడ్లర్లు ఎక్కువగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మురళీ కృష్ణంరాజు కూడా డ్రగ్స్ కస్టమర్లతో నేరుగా కలిసేవాడు కాదు. వైఫై ఆధారిత వాట్సాప్‌ కాల్స్‌, చాట్స్‌ ద్వారానే ఆర్డర్లు తీసుకునేవాడు. నగదు లావాదేవీలు చేయకుండా స్నేహితుల బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బులు వేయించి, అక్కడి నుంచి తనకు బదిలీ అయ్యేలా ప్లాన్‌ చేసుకున్నాడు. కానీ ఈ డెడ్‌డ్రాప్‌ వ్యవహారంపై కొండాపూర్‌లో ఈగల్‌ ఫోర్స్‌ పసిగట్టడంతో అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్‌తో పాటు మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
నైజీరియన్లతో పరిచయాలు పెంచుకున్న మురళీకృష్ణ

Read Also: BJP MLA: బీజేపీ బడ్జెట్ ‘‘అబ్బాయి’’, కాంగ్రెస్ బడ్జెట్ ‘‘అమ్మాయి’’.. ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

మురళీ కృష్ణంరాజు ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలోనే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి ఉత్తరాఖండ్‌, పుణే, గోవా వంటి రాష్ట్రాల్లో చిన్నచిన్న పనులు చేశాడు. ఆ సమయంలో నైజీరియన్లతో పరిచయాలు పెంచుకుని డ్రగ్స్‌ సరఫరా నెట్‌వర్క్‌లోకి అడుగుపెట్టాడు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి తన డెన్‌ను ఏర్పాటు చేసుకుని డ్రగ్స్‌ వ్యాపారం ప్రారంభించాడు. ధనిక వర్గాలను టార్గెట్‌గా చేసుకుని భారీగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. బెంగళూరు, ఢిల్లీ, గోవా నుంచి కోకైన్‌ను ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలించేవాడు మురళీకృష్ణ. డ్రైవర్లతో సెట్‌ అయి సరుకును హైదరాబాద్‌కు తెప్పించుకుని, రాపిడో బైక్‌ సర్వీసులు, కొరియర్‌ తరహా డెలివరీలతో వినియోగదారులకు చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు. నిందితుడు చిరంజీవి వర్మ డ్రగ్స్‌ కొనుగోలు చేయడమే కాకుండా తన పరిచయస్తులకు మురళీ కృష్ణంరాజు నంబర్‌ను ఇచ్చి కస్టమర్లను పెంచాడు. మూడో నిందితుడు హేమంత్‌రాజు ఇటీవల కోకైన్‌ వినియోగం ప్రారంభించి ముఠాకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు… స్పాట్..

హైదరాబాద్‌లోని దాదాపు 15 మంది ప్రముఖులకు ఈ ముఠా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మరికొందరు వినియోగదారుల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్‌ నెట్‌వర్క్‌పై మరింత సమాచారం కోసం దర్యాప్తు కొనసాగుతోందంటున్నారు పోలీసులు. హైదరాబాద్‌లో హైటెక్‌ పద్ధతులతో సాగుతున్న డ్రగ్స్‌ వ్యాపారంపై పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Exit mobile version