HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?

Crime News

Crime News

HYD BOY MISSING: ఊరు కాని ఊరుకు వెళ్లాడు.. బావిలో పడి చనిపోయాడు.. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడా? లేక ఎవరైనా హత్య చేశారా? అసలు బీటెక్ విద్యార్థి రాహుల్ మృతిలో ఏం జరిగింది? ఇదే అంశాన్ని ప్రశ్నిస్తున్నారు అతని తల్లిదండ్రులు. కనీసం తమ కొడుకు శవాన్నైనా అప్పగించాలని దీనంగా వేడుకుంటున్నారు. అసలు ఈ కేసులో 35 రోజుల క్రితం ఏం జరిగింది? ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏడాది మే 27న స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరాడు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాల్లో కనిపించిన రాహుల్, అనంతరం సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లినట్లు గుర్తించారు.

కానీ మే 30న ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యవసాయ బావిలో రాహుల్ మృతదేహం లభించింది. గుర్తు తెలియని మృతదేహంగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టారు. ఇదే సమయంలో తెలంగాణలో కుటుంబ సభ్యులు మిస్సింగ్ ఫిర్యాదు చేయడంతో.. దర్యాప్తులో అది రాహుల్ మృతదేహమేనని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కానీ ఇప్పటి వరకు.. అంటే ఘటన జరిగి 35 రోజులు గడిచినా మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. దీంతో రాహుల్ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదట మృతదేహాన్ని ఖననం చేసిన పోలీసులు.. విద్యార్థి సంఘాలు, కుల సంఘాల ఆందోళనల నేపథ్యంలో విచారణను మళ్లీ ప్రారంభించారు. ఖననం చేసే సమయంలో భద్రపరిచిన తొడ ఎముకను డీఎన్‌ఏ పరీక్షకు పంపగా, వారం క్రితం అది తల్లిదండ్రుల డీఎన్‌ఏతో సరిపోలినట్లు అధికారులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని అప్పగిస్తామని చెప్పినా.. చివరి నిమిషంలో మరో రెండు రోజులు వేచి ఉండాలని సూచించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

తమ కొడుకు తిరిగి బ్రతికి వస్తాడనే ఆశ ఎప్పుడో చనిపోయిందంటోంది తల్లి. కనీసం అతని ముఖం చూసుకునే అవకాశం అయినా కల్పించాలని కోరుతోంది. రాహుల్ అంత దూరం ఎందుకు వెళ్లాడు? బావిలో పడిపోవడానికి కారణం ఏమిటి? అది ఆత్మహత్యా, ప్రమాదమా, లేక హత్యా? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని తల్లి డిమాండ్ చేస్తున్నారు. అధికారుల స్పందన కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు.. న్యాయం కోసం త్వరలోనే విద్యార్థి సంఘాల మద్దతుతో తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసుల సమన్వయంతో వేగంగా దర్యాప్తు పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.