Site icon NTV Telugu

AP Crime: ప్లాన్‌ చేసి ప్రియురాలితో కలిసి భార్యను హత్య చేసిన భర్త.. పిల్లల ఫిర్యాదుతో వెలుగులోకి షాకింగ్‌ ఘటన..

Crime

Crime

AP Crime: కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో జరిగిన ఓ హత్య కేసు తొమ్మిది నెలల తర్వాత వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని భార్యను హత్య చేసిన భర్త, సహజ మరణంగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను మోసం చేసిన దారుణ ఘటన ఇది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పోరంకికి చెందిన ముక్కామల ప్రసాద్ చౌదరి, రేణుకాదేవి (46) దంపతులు. వీరికి కుమారుడు నగేష్, కుమార్తె తేజశ్రీ ఉన్నారు. కుమారుడు ప్రస్తుతం లండన్‌లో చదువుకుంటుండగా, కుమార్తె హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. రేణుకాదేవి పోరంకిలో బ్యూటిషన్‌గా పని చేస్తూ, ఆకునూరు ఝాన్సీ ఇంటికి వెళ్లి సేవలు అందించేది. ఈ పరిచయం క్రమంగా ప్రసాద్ చౌదరి, ఝాన్సీ మధ్య అక్రమ సంబంధంగా మారింది.

Read Also: Return Rush to Hyderabad: హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణాలు.. రద్దీగా మారిన హైవేలు..

ఈ అక్రమ సంబంధానికి భార్య రేణుకాదేవి అడ్డు వస్తోందని భావించిన ప్రసాద్ చౌదరి, ఝాన్సీతో కలిసి ఆమెను తొలగించేందుకు పథకం వేశారు. గత ఏడాది మే 18వ తేదీ రాత్రి రేణుకాదేవి అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, బంధువులను ప్రసాద్ నమ్మించాడు. మరుసటి రోజు మే 19న ఆమె మృతి సహజమేనని చెప్పి అంత్యక్రియలు నిర్వహించాడు. అయితే, తొమ్మిది నెలల తర్వాత కుమారుడు నగేష్‌కు తల్లి సెల్‌ఫోన్‌లో ఉన్న కాల్ రికార్డింగ్‌లు, ఫోన్ సంభాషణలు లభించాయి. వాటిలో తల్లి హత్యకు సంబంధించిన కీలక ఆధారాలు ఉండటంతో కుమారుడు, కుమార్తె మీడియా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్ కాల్ రికార్డింగ్‌లు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించిన అనంతరం ఇది హత్యేనని నిర్ధారించారు. ఈ నెల 13వ తేదీన ప్రసాద్ చౌదరి, ఆకునూరు ఝాన్సీలను పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల ధైర్యం, ఆధారాల వల్ల తొమ్మిది నెలల తర్వాత బయటపడ్డ ఈ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కేసుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Exit mobile version