మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆ నేరాన్ని రోడ్డు ప్రమాదంగా చూపించడానికి ఆమె మృతదేహాన్ని వీధిలో వదిలివెళ్లాడు. మొదట పోలీసులు ఈ సంఘటనను రోడ్డు ప్రమాదంగా పరిగణించారు.. కానీ పోస్ట్‌మార్టం నివేదికలో ఆ మహిళను తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు తేలింది. ఈ క్రమంలో.. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. భర్తతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
Read Also: T. Rajaiah: అవినీతి గురించి మాట్లాడే హక్కు కడియంకు లేదు..
ఫిబ్రవరి 12న గ్వాలియర్ నగరంలోని కాంపు పోలీస్ స్టేషన్ పరిధిలోని షీట్లా రోడ్డులో 22 సంవత్సరాల మహిళ మరణించింది. ఆ సమయంలో ఆమె భర్త ప్రదీప్ గుర్జార్ స్వల్ప గాయాలతో ఉన్నాడు. మొదట.. ప్రమాదం గురించి భర్త ప్రదీప్ చెప్పిన వివరాలను పోలీసులు అంగీకరించారు. కానీ అతని వాంగ్మూలంలో ఉన్న విరుద్ధతలు, సంఘటన స్థలం నుండి సేకరించిన ఆధారాలు అనుమానాలకు తావిచ్చాయి.
Read Also: Sukumar : సుకుమార్ తో షారుఖ్ సినిమా..?
దీంతో.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళ కుటుంబం ఆమెను వరకట్నం కోసం వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా.. ఫోరెన్సిక్ నివేదికలో ఆమెకు తగిలిన గాయాలు రోడ్డు ప్రమాదం వల్ల కాదని.. తీవ్రంగా కొట్టి చంపినట్లు నిర్ధారించారు. మరోవైపు.. నిందితుడు ప్రదీప్ ఈ నేరాన్ని ముందుగానే ప్లాన్ చేశాడని.. క్రైమ్ షోలు చూసి హత్య ఎలా చేయాలన్నది తెలుసుకున్నాడని పోలీసుల విచారణలో బయటపడింది. కాగా.. ఆధారాల ఆధారంగా పోలీసులు భర్త ప్రదీప్, అతని తండ్రి రాంవీర్ గుర్జార్, అతని బంధువులపై హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపారు. దీంతో నిందితుడు ప్రదీప్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ఇంకెవరైనా పాత్ర ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.