West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..

  • 16 ఏళ్ల పదో తరగతి విద్యార్థినిపై యువకుడి కత్తి దాడి.
  • ప్రేమ ప్రతిపాదన తిరస్కరించడంతో కక్షతో దాడి.
  • తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి.
Crime News

Crime News

West Bengal: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు సమీపంలో దారుణ సంఘటన జరిగింది. లవ్ ప్రపోజల్ తిరస్కరించిందే కారణంతో ఓ యువకుడు 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో, తీవ్ర గాయాలపాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. హౌరా జిల్లాలోని అండుల్ ప్రాంతంలో మహియారి ఖతిర్ బజార్‌లోని చంద్నీ బాగాన్‌లో ఘటన జరిగింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న బాలిక సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా, 24 ఏళ్ల సమీర్ దాస్ ఆమెను అడ్డగించి కత్తితో దాడి చేశాడు. మెడ, చేతి, పొత్తికడుపు భాగాల్లో పలుమార్లు పొడవడంతో ఆమె రోడ్డుపైనే కుప్పకూలింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హౌరా జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ఘటన తర్వాత సమీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు ముర్షిదాబాద్‌లోని మయూరేశ్వర్‌కు చెందిన వాడని, డోర్‌జూర్ లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తేలింది. పలుమార్లు ఇతను బాలికను ప్రేమ పేరుతో వేధించినట్లు తెలుస్తోంది. ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత అండుల్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించారు.