Ganja Racket: పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డోన్ట్ కేర్ అంటున్న గంజాయి స్మగ్లర్లు.. తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ దందాను కొనసాగించడం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. పుష్ప రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు తప్పించుకుంటున్నా.. ఏదో ఓ సమయంలో దొరికిపోతూనే ఉన్నారు. ఐతే గంజాయి స్మగ్లర్ల దందా చూసి పోలీసులే షాకవుతున్నారు. పుష్ప.. పుష్ప రాజ్.. తగ్గేదే లే.. అంటూ సినిమాలో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తాడు హీరో. ఇప్పుడు గంజాయి స్మగ్లర్లు కూడా అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. టన్నుల కొద్దీ గంజాయిని రాష్ట్రాలు దాటించి వినియోగదారులకు అందించేందుకు పని చేస్తున్నారు. ఇందులో లారీ డ్రైవర్లు కీలకంగా మారుతున్నారు. కానీ తెలంగాణ పోలీసులు.. వారికి ఎక్కడికక్కడ చెక్ పెట్టి భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు…
READ ALSO: Tragedy: 35 ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వ్యక్తి వివాహం.. పెళ్లి తర్వాత రోజే ఘోరం..
రాచకొండ పోలీసులు మరోసారి పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు. మహేశ్వరం జోన్ ఎస్ఓటీ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి చేసిన ఆపరేషన్‌లో 1210 కిలోల గంజాయి పట్టుబడింది. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుడిని విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన అనియా గ్రామ నివాసిగా గుర్తించారు. డ్రైవర్‌గా పనిచేస్తూ అక్రమ గంజాయి రవాణాలో పాలుపంచుకున్నాడు. ఈ క్రమంలో తన ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ గంజాయి స్మగ్లర్లు దేవీలాల్ అలియాస్ కాటు, అయూబ్ ఖాన్, రామలాల్‌తో పరిచయం ఏర్పడింది. వీరు విక్రమ్‌కు ఒక్కో రవాణాపై 5 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒడిశాలోని మాల్కాన్‌గిరి నుంచి రాజస్థాన్ వరకు గంజాయి తరలించే పనిని అప్పగించారు…
ఇక తనకు అప్పగించిన పనిలో భాగంగా విక్రమ్ రాజస్థాన్ నుంచి టాటా అల్ట్రా ట్రక్‌లో ఇనుము సరుకును మహారాష్ట్రలోని నాందేడ్ వరకు తీసుకెళ్లి.. అక్కడ అది ఖాళీ చేశాడు. ఆ తరువాత హైదరాబాద్ చేరాడు. అక్కడి నుంచి ఖమ్మం వెళ్లి సిమెంట్ సంచులు ఎక్కించాడు. ఈ సంచుల కింద గంజాయి ప్యాకెట్లు దాచేందుకు ముందే స్థలం వదిలి పెట్టాడు. ఆపై ఒడిశాలోని మాల్కాన్ గిరి చేరుకొని గుర్తు తెలియని వాళ్ల దగ్గర నుంచి 1210 కేజీల గంజాయి తీసుకున్నాడు. ప్యాకెట్లను సిమెంట్ సంచుల కింద దాచిపెట్టి, టార్పాలిన్‌తో కప్పి పోలీసులు గుర్తించకుండా జాగ్రత్తపడ్డాడు…
అంతా బాగానే ఉందనుకున్నాడు విక్రమ్. కానీ హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో నేషనల్ హైవే 65, కొత్తగూడ ఎక్స్ రోడ్ వద్ద ట్రక్‌ను ఆపి చెక్ చేశారు పోలీసులు. గంజాయి బయటపడడంతో విక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా అటవీ ప్రాంతాల నుంచి తెచ్చిన ఈ గంజాయి రాజస్థాన్‌లోని పలు ప్రాంతాలకు సరఫరా చేయాలని ఉద్దేశంగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఐతే విక్రమ్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
READ ALSO: London: లండన్‌లో మహాత్మా గాంధీకి అవమానం.. స్పందించిన భారత్