విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వాంబే కాలనీ అమ్మాయిపై తన స్నేహితులతో కలిసి ప్రియుడు అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడితో పాటు అతడి ఇద్దరి స్నేహితులు కలిసి ఆస్పత్రిలోనే యువతిపై గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తన కుమార్తెపై విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎన్టీవీతో బాధితురాలి తల్లి వెల్లడించింది. ఇంటి దగ్గర ఉన్న అమ్మాయిని వచ్చి ఏదో పని ఉందని ఓ అబ్బాయి తీసుకుని వెళ్లాడని.. అయితే తన కుమార్తె ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చూసేసరికి ఒంటి మీద బట్టలు లేవని, నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయని బాధితురాలి తల్లి తెలిపింది. తమ అమ్మాయికి మతిస్థిమితం లేదని.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే పట్టించుకోలేదని ఆరోపించింది.
కాగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటనపై సీఐ హసీన్‌బాబు స్పందించారు. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాధిత యువతి నిందితుల్లో ఓ అబ్బాయితో పరిచయం ఉన్నట్లు చెప్తుందని.. ఈ కేసును దిశ పోలీసులకు బదిలీ చేశామని వివరించారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉందన్నారు.