మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం జరిగింది. ఇరు కుటుంబాల తగాదాలతో ఓ వ్యక్తిని హత్య చేశారు. అనంతరం మొండెం నుంచి తలను వేరుచేసి ఇద్దరు నిందితులు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఉద్రిక్తతలు ఏర్పడడంతో పోలీసులు మోహరించారు.
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా దిండోరి తాలూకాలోని నానాషి గ్రామంలో సురేష్ బోకె(40), పొరుగువాడైన గులాబ్ రామచంద్ర వాగ్మారే(35) మధ్య చాలా కాలంగా గొడవలు ఉన్నాయి. ఇక డిసెంబర్ 31, 2024న ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనతో సురేష్ బోకె కుటుంబం పగతో రగిలిపోయింది. అంతే న్యూఇయర్ వేళ.. బుధవారం ఉదయం సురేష్ బోకె, అతని కుమారుడు… గులాబ్ రామచంద్ర వాగ్మారేను గొడ్డలితో నరకగా ఘటనాస్థలిలోనే ప్రాణాలు పోయాయి. అంతటితో ఆగకుండా కత్తితో పీక కత్తిరించి తలను తీసుకుని గురువారం తండ్రి, కొడుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నిందితుల ఇల్లును, కారును ధ్వంసం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్‌ల సిబ్బందితో పాటు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పీఎఫ్) సిబ్బంది గ్రామంలో మోహరించారు. నిందితులు ఆయుధాలు, తలను తీసుకుని నానాషి అవుట్‌పోస్ట్ పోలీసు చౌకీకి చేరుకున్నారని ఒక అధికారి తెలిపారు.
ఇక బాధితురాలి భార్య మినాబాయి (34) ఇచ్చిన ఫిర్యాదు మేరకు 103 (1) (హత్య), 352 (శాంతి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 351 (2) (3) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు బోకెను అరెస్ట్ చేశారు. అలాగే అతడి కుమారుడు కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక భద్రతా కారణాల నేపథ్యంలో నిందితులను దిండోరి పోలీసులకు అప్పగించారు. గురువారం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.