సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య వృద్ధులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆటకు మరో వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసేశారు. డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్‌కు చాలా కీలకమైన పదం. దీన్ని ఉపయోగించి అమాయకులైన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వృద్ధున్ని ఇలాగే మోసం చేశారు…
2025 జులై 12న బాధితుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనకు తాను TRAI అధికారినని చెప్పుకున్నాడు. వృద్ధుడి ఆధార్ కార్డు ఆయనకే చూపించారు. అంతే కాదు ఆ ఆధార్ కార్డును మానవ అక్రమ రవాణా కేసుల్లో వాడారని చెప్పారు. దీనిపై కంబోడియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ దేశాల్లో సైబర్ నేరాలకు సంబంధించి కేసు నమోదైందని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారని భయపెట్టారు. ఇక తాము చెప్పిన దానికి రుజువులు అన్న విధంగా గతంలో వృద్ధుడి పేరు మీద ఉన్న కెనెరా బ్యాంక్ ఏటీఎం కార్డుతోపాటు నకిలీ సుప్రీం కోర్టు నోటీస్ చూపించారు. ఈ కేసులో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు..
అప్పటికే కేటుగాళ్ల మాటలు నమ్మిన వృద్దుడు తీవ్రంగా భయాందోళనకు గురయ్యాడు. నిజానికి గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పని చేసి రిటైరైనప్పటికీ.. కేటుగాళ్లు చెప్పిన విధంగా ఫాలో అయ్యాడు. కేసుల నుంచి విముక్తి కలిగించాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు పంపించాలని చెప్పారు సైబర్ క్రిమినల్స్. వారు చెప్పిన విధంగానే… ఆయా అకౌంట్లకు 80,64,002 రూపాయలు పంపించాడు. కాల్ కట్ చేసిన తర్వాత ఇది మోసమని గ్రహించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు…
అసలు ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదమే లేదని పోలీసులు చెబుతున్నారు. మోసగాళ్లు తరచూ TRAI, CBI, పోలీసు, ఇతర ప్రభుత్వ సంస్థల పేర్లను వాడి భయపెట్టే ప్రయత్నం చేస్తారని..కానీ అలాంటి వాటిని నమ్మవద్దంటున్నారు. CBI వారెంట్‌లు, FIRలు, సుప్రీంకోర్టు ఆర్డర్‌లు వంటి నకిలీ డాక్యుమెంట్లు చూపించి మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతే కాదు.. తెలియని వారికి బ్యాంక్ ఖాతా వివరాలు, OTP, వ్యక్తిగత సమాచారం ఎప్పుడూ ఇవ్వవద్దని… ఫోన్‌లో అసలే చెప్పవద్దని కోరుతున్నారు…