Cyber Crime: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎవ్వరికి ఏ పేరుతో.. చేస్తే.. పని అవుతుందో పనిగట్టి.. అలా పని కానిస్తున్నారు.. తాజాగా, నెల్లూరు జిల్లాలో వెలుగు చూసిన సైబర్ క్రైమ్‌ను చూస్తే.. అసలు ఎవరు? నకిలీ ఎవరు? అనే అయోమయంలో పడిపోవాల్సిన పరిస్థితి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నారాయణ మెడికల్ కళాశాల డైరెక్టర్ పునీత్ పేరుతో నారాయణ సంస్థ ఆడిటర్ సురేష్ కుమార్‌ను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.. కొత్త వాట్సాప్ నెంబర్‌ను వాడుతున్నానని… నూతన ప్రాజెక్ట్ కోసం తాను పంపిన ఖాతా నంబర్‌కు రూ.కోటి 96 లక్షలు పంపాలని మెసేజ్ పెట్టారు జాదుగాళ్లు.. ఇక, అనుమానం రాకుండా.. వాట్సాప్ డీపీలోనూ పునీత్ ఫొటో పెట్టారు కేటుగాళ్లు..
అయితే, సదరు ఆడిటర్ సురేష్ కుమార్.. వాట్సాప్ కాల్‌లో డైరెక్టర్ పునీత్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు.. తాము మాట్లాడితే అనుమానం వస్తుందని కొత్త నాటకానికి తెరసీని కేటుగాళ్లు.. తాను ప్రభుత్వ అధికారులతో సమావేశంలో ఉన్నానని మెసేజ్ పెట్టారు.. అవతలి వ్యక్తి తమ కాలేజీ డైరెక్టరే అని నమ్మిన ఆడిటర్ సురేష్ కుమార్.. సైబర్ నేరగాళ్లు పంపించిన బ్యాంకు ఖాతాను నగదును బదిలీ చేశారు.. ఇక, క్షణాల్లో కేటుగాళ్లు అని బయటపడింది.. ఎందుకుంటే.. డబ్బులు బదిలీ చేసిన కొద్దిసేపటికే వాట్సాప్ డీపీ నుంచి పునీత్ ఫొటో మాయమైంది.. అంతేకాదు.. ఫోన్ స్విచాఫ్ చేశారు.. అనుమానంతో మరో నెంబర్‌లో ఉన్న పునీత్ ను సంప్రదించగా తాను డబ్బులు అడగలేదని వెల్లడించారు.. దీంతో, మోసపోయానని గ్రహించిన ఆడిటర్ సురేష్ కుమార్.. సైబర్ కేటుగాళ్లు చేసిన పనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు..