Cyber Crimes In Hyderabad: గుర్తుతెలియని ఫోన్ నుంచి మనకు కాల్ వస్తుంది. కాల్‌ని ఎత్తేసరికి అవతల నుంచి అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్తారు. అంతేకాదు మీ పార్సెల్ వచ్చింది. వెంటనే ఓటీపీ చెప్పాలని డిమాండ్ చేస్తారు. తాను ఎలాంటి పార్సెల్ చేయలేదని చెప్పినా వాళ్ళు వినరు.. మేము మీ బిల్డింగ్ కిందే ఉన్నాం.. మీకు వచ్చిన ఓటీపీ చెప్తే వెంటనే మీ పార్సెల్ డెలివరీ చేసి వెళ్ళిపోతామని చెప్తారు. అంతేకాదు.. మనల్ని బెదిరించే ధోరణితో మాట్లాడుతారు. మీరు ఓటిపి చెప్పకపోతే, మీ పార్సెల్‌ను వెంటనే క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిస్తారు. కర్మ కాళీ వాళ్లు అడిగినట్లు ఓటిపి చెప్తే.. వెంటనే మన బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మొత్తం మాయం అయిపోతాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ఈ మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త రకంగా జరుగుతున్న ఓటిపి ఫ్లాట్స్‌పై ఇప్పుడు పోలీసులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్‌లైన్‌లోనే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఓటిపి అనే దాన్ని చెప్పి, దాని ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎత్తులకు సైబర్ కేటుగాళ్లు పైఎత్తులు వేసి ప్రజల డబ్బును దోచుకుంటున్న తీరు ఇది. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని.. సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు లావాదేవీల్లో ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించేందుకు ఎత్తులకు పైఎత్తులు వేసి డబ్బుల్ని కొట్టేస్తున్నారు. అమెజాన్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఒక వస్తువును ఆర్డర్ చేశారు. దాని పార్సెల్ వచ్చింది. మీరు ఆర్డర్ చేశారు.. డెలివరీ ఎక్కడ ఇవ్వాలంటూ ఫోన్లు తికమక పెడుతున్నారు. మీరు వెంటనే మీకు వచ్చిన ఓటిపిని చెప్పాలని అడుగుతారు. ఓటిపి చెప్పకపోతే మీ ఆర్డర్‌ని క్యాన్సల్ చేస్తామని తెలుపుతారు. ఆర్డర్ ఇవ్వలేదని అంటే, క్యాన్సిల్ చేస్తామనీ, లేదంటే ఓటీపీ చెప్పండని సైబర్ నేరగాళ్లు అడుగుతున్నారు. సైబర్ నెరగాళ్ల బుట్టలో పడిపోయి మనం ఓటీపీ గనక చెప్పినట్లయితే మన బ్యాంక్ ఖాతా మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ తరహాలో మోసాలపై ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా సైబర్ క్రైమ్ పోలీసులకు వస్తున్నాయి. వరుసగా ఇలాంటి ఫిర్యాదులు వస్తుండడంతో జంటనగరాల్లోని పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆన్‌లైన్ చీటింగ్‌లపై మరింతగా అవగాహన కల్పిస్తున్నామని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. సైబర్ క్రిమినల్స్ ముందుగానే డార్క్ నెట్ నుంచి మన ఫోన్ నంబర్ ద్వారా బ్యాంక్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను తీసుకుంటున్నారు. వాళ్ల దగ్గర ఉన్న వాటి ద్వారా ఆన్‌లైన్‌లో పలు వాలెట్‌లలో కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నారు. తర్వాత అమాయకులకు ఫోన్లు చేసి మీరు ఆర్డర్ చేశారు కదా.. డెలివరీ చేయడానికి వచ్చాను.. ఈ వీధిలోనే ఉన్నానని నమ్మ పలుకుతున్నారు. ఏ ఆర్డర్ ఇవ్వలేదంటే రద్దు చేస్తున్నాను. అప్పుడు కూడా మీకు ఓటీపీ వస్తుంది అది చెప్పండని అడుగుతున్నారు. మనం ఓటీపీ చెప్పగానే బాధితుల బ్యాంక్ ఖాతా నుంచి నగదు సెకన్లలో ఖాళీ చేసేస్తున్నారు.
ఓటీపీ ఎవరికీ గుర్తుతెలియని వ్యక్తులకు కూడా చెప్పొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఓటీపీ ఆన్‌లైన్‌లో జరిపే లావాదేవికి మీకు మాత్రమే వస్తుంది. కాబట్టీ ఓటీపీలను ఎవరికీ చెప్పొద్దని.. OTP సంఖ్య చెప్పారంటే సైబర్ నేరగాళ్లకు మీ ఖాతా తాళాలు ఇచ్చినట్లే అవుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారను. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మన వ్యక్తిగతంగా ఉండే ఓటీపీని ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయవద్దని సైబర్ క్రైమ్ ఎసిపి శ్రీధర్ తెలిపారు.