సినిమాలను చూసి క్రైమ్ జరుగుతుందో.. క్రైమ్ చూసి సినిమాలు తీస్తున్నారో అర్ధం కావడం లేదు. అచ్చు గుద్దినట్లు సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రం అందరు చూసే ఉంటారు. అందులో రవితేజ.. దొంగబాబా అవతారం ఎత్తి హరోం హర అత్తిలి చిదబర.. అంటూ కొందరి ఇళ్లకు వెళ్లి .. తనను తాను గొప్ప మహర్షిగా చెప్పుకుంటూ.. లక్ష్మీ దేవి మూట లోపలికి తోస్తది అందరికీ చెప్తూ వారందరికీ అర గుండ్లు కొట్టిస్తాడు. ఈ సీన్ అందరికి నవ్వులు పూయించిన విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి సీనే పానీపట్ లో రిపీట్ అయ్యింది. లక్ష్మీదేవి లోపలి రావాలంటే..నగలు అన్ని తీసి మూటకట్టి తూర్పు తిరిగి దండం పెట్టాలని మాయమాటలు చెప్పి ఓ మహిళ ఒంటి మీద ఉండే బంగారం పర్సులోని డబ్బు చివరికి తాళి బొట్టును కూడా తీసి పట్టుకుపోయారు దొంగ బాబాలు..
వివరాలలోకి వెళితే.. హరియాణాలోని పానిపట్లో ఓ మహిళ, కుటుంబంతో సహా నివసిస్తోంది. గతకొన్నిరోజులుగా ఆమెకు ఆరోగ్యం బాగోకపోవడంతో పక్కింటి వారి వద్ద అప్పు తీసుకొని హాస్పిటల్ కి బయల్దేరింది. అక్కడికి వెళ్ళాకా మెడికల్ షాపులో మందులు తీసుకుందామని వెళ్తుండగా ఆమెకు ఇద్దరు స్వామీజీలు కనిపించారు.. తాము గొప్ప స్వాములమని, నీకున్న కష్టాలు అన్ని తమకు తెలుసని నమ్మబలికారు. అంతేకాకుండా లక్ష్మీదేవి నీ మీద కోపంగా ఉందని చెప్పడంతో నమ్మిన మహిళ.. లక్ష్మీ దేవి కోపం పోవాలంటే ఏం చేయాలనీ అడిగింది. దీంతో దొంగ బాబాలు తన ఒంటి మీద ఉండే నగలు తన దగ్గర ఉన్న డబ్బును ఓ మూటగా కట్టి తమకు ఇవ్వాలని, అనంతరం వారు ఉన్న చోటు నుంచి తూర్పుగా 81 అడుగుల దూరం వెళ్లి లక్ష్మీ దేవిని మనసులో ప్రార్థించి తిరిగి రావాలని చెప్పారు.
ఇలా చేస్తే అమ్మ కోపం తగ్గతుందని చెప్పారు. ఆ మాయమాటలు నమ్మిన మహిళా స్వాములు చెప్పినట్లు చేసింది. వెనక్కి వచ్చాకా అక్కడ ఎవరు కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారిని అడిగింది. అయినా ప్రయోజనం లేకపోయేసరికి తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.