Kidnap Case : హైదరాబాద్ నగరాన్ని షాక్‌కు గురి చేసిన అంబర్‌పేట్ రియల్టర్ కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. అక్టోబర్ 29న అంబర్‌పేట్ డీడీ కాలనీలో జరిగిన ఈ ఘటనలో రియల్టర్ మంత్రి శ్యామ్‌ను కిడ్నాప్ చేసిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించి, ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి నేతృత్వంలోని పోలీసు బృందం పెద్ద ఎత్తున ఆధారాలు సేకరించింది. దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, మంత్రి శ్యామ్ కిడ్నాప్ వెనుక అతని మొదటి భార్య మాధవీలతే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తెలిపారు. ఆస్తి పంపకాల విషయంలో ఏర్పడిన విభేదాలు, వ్యక్తిగత అసహనం కారణంగా ఆమె ఈ ఘోర ప్రణాళిక రచించినట్లు దర్యాప్తులో తేలింది.
డీసీపీ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. శ్యామ్ అమెరికాలో నివసిస్తున్న సమయంలో మాధవీలతను వివాహం చేసుకున్నారు. అయితే మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గత మూడేళ్లుగా ఆమె శ్యామ్‌కు దూరంగా ఉంటోంది. ఇదే సమయంలో శ్యామ్ తన పేరును అలీగా మార్చుకొని ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నారు. ఈ పరిణామం తర్వాత ఆస్తి పంపకాల విషయంలో వివాదం ప్రారంభమైందని పోలీసులు తెలిపారు. శ్యామ్ తండ్రి నుంచి వచ్చిన రూ.20 కోట్ల విలువైన ఆస్తిని విక్రయించినట్లు సమాచారం. దీనిపై మాధవీలతకు తీవ్ర ఆగ్రహం కలిగిందని, ఈ నేపథ్యంలో తన స్నేహితుడు సాయి సహాయంతో కిడ్నాప్ ప్లాన్ వేసిందని దర్యాప్తులో తేలింది. సాయి రామనగర్ ప్రాంతానికి చెందినవాడు కాగా, ఈ గ్యాంగ్ మొత్తం 14 మంది సభ్యులతో ఏర్పాటయిందని పోలీసులు పేర్కొన్నారు.
మాధవీలత సూచనల మేరకు ఈ గ్యాంగ్ అక్టోబర్ 29న డీడీ కాలనీలో ఉన్న శ్యామ్ ఇంటి వద్దకు వెళ్లి, సాయంత్రం సమయానికి అతన్ని బలవంతంగా కిడ్నాప్ చేసింది. ఆయనను రెండు రెంట్ కార్లలో చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి, రూ.1.5 కోట్లు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ ఆపరేషన్‌లో మహిళల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. జీ.ప్రీతి అనే లేడీ బౌన్సర్ ఈ గ్యాంగ్‌లో సభ్యురాలిగా పనిచేసిందని తెలిపారు. అలాగే ఎల్. సరిత అనే మహిళ ఘటనకు రెండు రోజుల ముందు శ్యామ్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉండి, అతని కదలికలను గమనిస్తూ నిఘా పెట్టిందని దర్యాప్తులో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు చెర్లపల్లిలోని రెండు వేర్వేరు ప్రదేశాల్లో శ్యామ్‌ను బంధించి, రూ.30 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. ఆ సమయంలో శ్యామ్ తెలివిగా వ్యవహరించి, తన స్నేహితుడికి కాల్ చేసి సహాయం కోరాడు. అతని స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, అధికారులు వేగంగా స్పందించి ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరిపి, 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి మూడు కార్లు, రెండు బైకులు, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇంకా మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టుకుంటామని డీసీపీ బాలస్వామి తెలిపారు.
డీసీపీ మాట్లాడుతూ.. “కిడ్నాప్ కేసులో ప్రతి ఒక్కరి పాత్రను నిర్ధారించాం. ప్రధాన సూత్రధారి మాధవీలతతో పాటు, ఈ నేరానికి సహకరించిన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కిడ్నాప్‌లు, ఆస్తి వివాదాల పేరుతో జరుగుతున్న ఇలాంటి ఘటనలను పోలీసులు సహించబోరు” అని హెచ్చరించారు.