A Man Killed By Brick Over Parking Issue In Ghaziabad: పార్కింగ్ కోసం.. కేవలం కారు పార్కింగ్ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన ఒక వ్యక్తి, మరో వ్యక్తిని చంపేశాడు. ఇటుకతో తల పగలగొట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వరుణ్ (35) అనే వ్యక్తి తన నివాసానికి సమీపంలో ఉండే ఒక ఢాబాకు నిన్న రాత్రి వెళ్లాడు. పార్కింగ్‌లో అతడు మరో కారు పక్కన తన కారుని పార్క్ చేశాడు. అయితే.. పక్కనున్న కారు డోర్ ఓపెన్ చేయడానికి వీలు లేని విధంగా అతడు తన కారుని పార్క్ చేయడం జరిగింది. ఇదే వివాదానికి కారణం అయ్యింది.
ఆ కారు యజమాని వరుణ్‌ని పిలిచి, మరీ కారు డోన్ ఓపెన్ చేయలేనంతగా కారు పార్క్ చేశావేంటి? అని నిలదీశాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో సహనం కోల్పోయిన నిందితుడు.. పక్కనే ఉన్న ఇటుక తీసుకొని, వరుణ్ తలపై గట్టిగా మోదాడు. ఆ దెబ్బకు వరుణ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడు చనిపోయాడనుకొని, నిందితుడు వెంటనే తన స్నేహితులో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. అటు, వరున్‌ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వరుణ్‌ని చంపిన నిందితుల్ని పట్టుకునేందుకు.. ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. వరుణ్ ఒక డెయిరీ వ్యాపారి. అతని తండ్రి మాజీ పోలీస్ అధికారి. వరుణ్‌ని చంపే దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో విడుదల చేశారు. అవి వైరల్‌గా మారాయి. ఆ దృశ్యాల ఆధారంగా, నిందుతుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఘజియాబాద్‌లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుంటాయని, వీటిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.