సైబర్ నేరగాళ్లు ఎప్పుడెప్పుడు జనాల్ని బుట్టలో పడేద్దామా? టోకరా వేద్దామా? అంటూ నిత్యం కాచుకొని ఉంటారు. ఇందుకోసం వాళ్లు చేయని ప్రయత్నాలు, రచించని వ్యూహాలంటూ ఉండవు. లక్షల్లో, కోట్లలో ప్రైజ్‌మనీ గెలుచుకున్నారంటూ.. తమ ట్రాప్‌లో పడేసేందుకు ట్రై చేస్తారు. ఇలా ఎంతోమంది టెంప్ట్ అయ్యి, లక్షలు పోగొట్టుకున్నారు. తాజాగా ఓ యువ వ్యాపారి కూడా అలాగే మోసపోయాడు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి, లక్షల రూపాయల్ని బుగ్గిపాలు చేసుకున్నాడు. ఆ కేసు వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఓ యువకుడు.. ఈనెల 9వ తేదీన ఆన్‌లైన్‌లో రూ. 432తో టీ-షర్ట్స్ కొనుగోలు చేశాడు. ఈ ట్రాన్సాక్షన్ గురించి తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు.. 13వ తేదీన అతనికి ఫోన్ చేశారు. తొలుత ప్రశాంతి అనే యువతి ఫోన్ చేసింది. ‘‘కంగ్రాచులేషన్స్, టీ-షర్ట్స్ కొన్న మీరు లక్కీ విజేతగా రూ. 6.20 లక్షలు గెలుచుకున్నారు. కేవలం కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే, ఆ సొమ్ము మీకు అందుతుంది’’ అంటూ మాయమాటలు ఆ యువతి చెప్పింది. తాను కొనుగోలు చేసిన టీ-షర్ట్స్ ప్రస్తావన తీసుకురావడంతో, నిజంగానే లక్కీ డ్రా గెలిచానేమోనని నమ్మేశాడు.
ఆ వెంటనే అతనికి అలోక్‌కుమార్ సింగ్, సంజయ్‌శర్మ పేర్లతో మరో రెండు ఫోన్లు వచ్చాయి. పక్కా ప్రొఫెషనల్స్‌గా మాట్లాడడంతో, వారి మాటల్ని నమ్మేశాడు. తమ బుట్టలో పడ్డాడని తెలుసుకున్న ఆ నేరగాళ్లు.. ఎన్‌వోసీ, టీడీఎస్, ఆదాయ పన్ను, కన్వర్‌జేషన్ చార్జీల పేరిట తమ ఖాతాలో డబ్బు జమ చేసుకున్నారు. అంతేకాదు.. ‘మీరు అదనంగా రూ. 10.41 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారని నమ్మించి.. ఆ డబ్బు పొందాలంటే రూ. 1,09,000 కట్టాలని అడిగారు. అలా అతడ్ని నమ్మించి ఏకంగా రూ. 3,21,200 కొట్టేశారు.
తమ ఖాతాలో డబ్బు మొత్తం జమ అయిన తర్వాత.. త్వరలోనే మీకు ఫోన్ చేస్తామని చెప్పి వాళ్లు పెట్టేశారు. కానీ, అతనికి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. తిరిగి వాళ్ల నంబర్స్‌కి కాల్ చేస్తే.. అవి స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు.. సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.