NTV Telugu Site icon

Chennai: ముంబై బాలికపై ఆటోడ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు అత్యాచారం.. నిందితుల్లో ఏపీ వాసి

Chennai

Chennai

దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ముంబైకి చెందిన ఓ బాలికపై ఆటో డ్రైవర్ సహా ఆరుగురు టెక్కీలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

ముంబైకి చెందిన 16 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు దీపావళి పండుగకు పుదుచ్చేరిలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ బాలిక.. తల్లితో గొడవపడి అక్టోబర్ 30న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పర్యాటక ప్రాంతాలు చూపించాలంటూ ఓ ఆటో డ్రైవర్‌ను కోరింది. డ్రైవర్.. నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను పుదుచ్చేరిలోని బీచ్‌ రోడ్‌లో వదిలేసి వెళ్లాడు. అక్కడ బలహీన స్థితిలో కనిపించిన బాలికను చెన్నైకి చెందిన ఆరుగురు టెక్కీలు గమనించారు. చెన్నైలో స్నేహితుడి ఇంటికి వెళ్లాలని ఆమె అడగగానే.. తాము తీసుకెళ్తామంటూ నమ్మించి చెన్నైకి తీసుకొచ్చారు. అనంతరం ఓ గదికి తీసుకెళ్లి బాలికపై ఒకరి తర్వాత మరొకరు.. వరుసగా ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తిరిగి ఆమెను క్యాబ్ బుక్ చేసి పుదుచ్చేరికి పంపేశారు.

అయితే తమ కుమార్తె తప్పిపోయిందంటూ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్న పోలీసులుకు.. బీచ్‌లో బాలిక తారసపడ్డాది. బలహీన స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. బాలిక వ్యక్తిత్వ లోపానికి గురైనట్లుగా గుర్తించారు. బాలిక ద్వారా వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. తనపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా తెలిపింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విల్లుపురం జిల్లా కోటకుప్పానికి చెందిన డ్రైవర్ కాజా మొహిదీన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అనంతరం చెన్నైకి చెందిన ఆరుగురు టెక్కీలలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని, ఒడిశాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడినవారందరినీ పట్టుకునే వరకు అరెస్టయిన వారి పేర్లను బయటపెట్టకూడదని పోలీసులు నిర్ణయించారు.

ఆటో డ్రైవర్ మొహిదీన్ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లే ముందు గెస్ట్‌హౌస్‌లో ఆమెపై దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. మొహిదీన్, ఇతరులపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012లోని సెక్షన్ 6 మరియు BNS సెక్షన్ 137 కింద కేసు నమోదు చేశారు. మొహిదీన్ జైలులో ఉండగా.. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నారు.