NTV Telugu Site icon

RRR Review : ఆర్ఆర్ఆర్

rrr

rrr

న‌ట‌వ‌ర్గం: య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, అలియా భ‌ట్, అజ‌య్ దేవ‌గ‌ణ్, ఒలివియా మోరిస్, స‌ముతిరఖ‌ని, అలిస‌న్ డూడీ, రే స్టీవెన్ స‌న్, శ్రియా శ‌ర‌ణ్, రాజీవ్ క‌న‌కాల‌, ఛ‌త్రప‌తి శేఖ‌ర్, రాహుల్ రామ‌కృష్ణ‌, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్
సినిమాటోగ్రఫి: కె.కె. సెంథిల్ కుమార్
సంగీతం: ఎమ్.ఎమ్.కీర‌వాణి
యాక్షన్: నిక్ పావెల్
నిర్మాత‌: డి.వి.వి. దాన‌య్య‌
ద‌ర్శక‌త్వం: ఎస్.ఎస్.రాజ‌మౌళి

జ‌నం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రాజ‌మౌళి మేగ్నమ్ ఓప‌స్ ఆర్.ఆర్.ఆర్. రానే వ‌చ్చింది. బాహుబ‌లి- ద కంక్లూజ‌న్ త‌రువాత దాదాపు ఐదేళ్ళకు వ‌చ్చిన రాజ‌మౌళి చిత్రమిది. అర‌వింద సమేత‌ విడుద‌లైన నాలుగేళ్ళకు విడుద‌లైన జూనియ‌ర్ య‌న్టీఆర్ చిత్రమూ ఇదే. విన‌య విధేయ రామ‌ జ‌నం ముందు నిల‌చిన మూడేళ్ళకు వెలుగు చూసిన‌ రామ్ చ‌ర‌ణ్ చిత్రం కూడా ఇదే. అందువ‌ల్ల ట్రిపుల్ ఆర్ మూవీపై రోజు రోజుకూ ఈ ముగ్గురు ఆర్ల అభిమానుల మ‌దిలోఆస‌క్తి చిందులు వేయ‌డం స‌హ‌జ‌మే. ఇక రాజ‌మౌళి ఇంత‌కు ముందు త‌న జాన‌ప‌ద చిత్రం బాహుబ‌లి రెండు భాగాల‌తోనూ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ కార‌ణాల వ‌ల్ల ఆది నుండీ ఆర్.ఆర్.ఆర్.పై సినీ ఫ్యాన్స్ అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. అది యావ‌ద్భార‌తంలో క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ట్రిపుల్ ఆర్ జ‌నం ముందు నిల‌చింది.

అన్నిటినీ మించిన ఆస‌క్తి!
తెలుగునాట జూ.య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఇద్దరికీ ఉన్న మాస్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పవ‌ల‌సిన ప‌నిలేదు. వారిద్దరూ క‌ల‌సి న‌టించ‌డం అన్నది సినీఅభిమానులకు పెద్ద విశేష‌మే. అందునా వారిద్దరికీ చెరిగిపోని, త‌రిగిపోని రికార్డులుగా నిల‌చిన చిత్రాల‌ను అందించిన రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌ల‌సి న‌టించ‌డం అన్నది మ‌రింత విశేషం! ఈ విశేష‌మే ఇంత‌లా ఉంటే, తెలుగునాట పోరాట యోధులుగా నిల‌చిన మ‌న్నెం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు, గోండు బెబ్బులి కొమ‌రం భీమ్ పాత్రల నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని మొద‌టి నుంచీ వినిపించ‌డంతో అంద‌రిలోనూ మ‌రింత ఆస‌క్తి నెల‌కొంది. సీతారామ‌రాజు దేశాన్నే పాలించిన తెల్లవారిపై పోరాటం సాగించిన విప్లవ‌జ్యోతి, ఇక త‌న జాతి గౌర‌వం కోసం నాటి నిజామ్ ప్రభుత్వాన్ని ఎదిరించిన మొన‌గాడు కొమరం భీమ్. వీరిద్దరూ తెలుగువారికి చిర‌స్మర‌ణీయులే. కానీ, ఏ నాడూ క‌లుసుకోలేదు. మ‌రి అలాంటి వారిద్దరినీ రాజ‌మౌళి ఎలా కలిపారు అన్న ఆస‌క్తి ఆర్.ఆర్.ఆర్.పై మ‌రింత క్రేజ్ ను పెంచింది. ఇక ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుద‌లైన సంద‌ర్భంలోనూ ఆ అమ‌ర‌వీరుల గౌర‌వానికి భంగం క‌లిగించారన్న నిర‌స‌న గ‌ళాలూ వినిపించాయి. ముఖ్యంగా కొమ‌రం భీమ్ పాత్రను పోలిన య‌న్టీఆర్ త‌ల‌పై ముస్లిమ్ టోపీ ఉండ‌డాన్ని చాలామంది నిర‌సించారు. వీటన్నిటికీ రాజ‌మౌళి సినిమా చూస్తే అన్నీ అర్థమవుతాయి అంటూ స‌మాధాన‌మిస్తూ వ‌చ్చారు. అందుకు త‌గ్గట్టుగానే జ‌క్కన్న జ‌నం ముందు చిత్రాన్ని నిలిపారు.

క‌థ ఏమిటంటే…
ఆర్.ఆర్.ఆర్ క‌థ 1920ల‌లో ఆదిలాబాద్ లో మొదలువుతుంది. గోండు జాతికి చెందిన ఓ ప‌చ్చబొట్లు పొడిచే మల్లి అనే పాపను బ్రిటిష్ గవర్నర్ భార్య త‌మ‌తోనే ఉంచుకుందామ‌ని ఢిల్లీ కి తీసుకువెళ్తుంది. ఆ పాప త‌న త‌ల్లిని చూడాల‌ని ఆరాట‌ప‌డుతుంది. ఆ ప‌సిదాని త‌ల్లి కూడా త‌న క‌న్నబిడ్డను చూసుకోవాల‌ని త‌పిస్తుంది. ఇది తెలిసి భీమ్ ఎలాగైనా త‌మ గోండు పాప‌ను ర‌క్షించాల‌నుకుంటాడు. అందుకోసం ఢిల్లీ కి వెళ్తాడు. ఇదిలా ఉంటే ఓ ప్రత్యేక కారణం గా పోలీస్ ఆఫీసర్ కావాల‌న్నది రామ్ లక్ష్యం. అందుకు త‌గ్గట్టుగానే పెరిగి పెద్దయ్యాక నాటి బ్రిటిష్ గ‌వ‌ర్నమెంట్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్ అవుతాడు. గోడు పాప కోసం భీమ్ ఢిల్లీకి వచ్చినట్టు బ్రిటిషర్స్ కు తెలుస్తుంది. ఈలోగా ఓ సంద‌ర్భంలో ఇన్ స్పెక్టర్ రామ్, భీమ్ క‌లుసుకుంటారు. వారిద్దరి మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డుతుంది. ముస్లిమ్ లాగా క‌నిపించే భీమ్, చ‌లాకీగా ఉండే రామ్ ఇద్దరూ త‌మ అస‌లు ల‌క్ష్యాలను చెప్పుకోరు. కానీ, వారి స్నేహ‌బంధం మాత్రం చెరిగిపోనిది. మల్లిని వెతికే క్రమం లో గవర్నర్ కూతురు జెన్నీ కి భీమ్ దగ్గరవుతాడు. ఆమె ఆహ్వానం మేరకు పార్టీ కి వెళ్తాడు. అక్కడ త‌మ డాన్సుల్లాగా మీ నాట్యం ఉండ‌దు అని బ్రిటిష్ వాళ్ళు గేలి చేస్తారు. దాంతో ఈ ఇద్దరు మిత్రులు త‌మ ‘నాటు’ డాన్స్ తో ర‌క్తి క‌ట్టిస్తారు. ఇలా ఆనందంగా సాగుతున్న వారి స్నేహ‌బంధాన్ని విధి విడ‌దీసే ప్రయ‌త్నం చేస్తుంది. త‌మ బ్రిటిష్ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న గోండు నాయ‌కుడు భీమ్ ను ప‌ట్టుకోవాల‌నే బాధ్యతను గ‌వ‌ర్నమెంట్ రామ్ కు ఇస్తుంది. భీమ్ ను బంధించి తెస్తే, మ‌రింత ఉన్నత స్థానానికి వెళ‌తావ‌నీ హామీ ఇస్తుంది. దాంతో రామ్ భీమ్ ను ప‌ట్టుకొనే ప్రయ‌త్నం మొద‌లు పెడ‌తాడు. అలా రామ్ కు త‌న మిత్రుడే భీమ్ అన్న విష‌యం తెలుస్తుంది. అలాగే భీమ్ త‌న స్నేహితుడే బ్రిటిష్ ప్రభుత్వంలో ప‌నిచేస్తున్న ఇన్ స్పెక్టర్ రామ్ అని తెలుసుకుంటాడు. త‌న‌ను రామ్ మోసం చేశాడ‌ని భీమ్, త‌న‌ వద్ద భీమ్ ర‌హ‌స్యం దాచాడ‌ని రామ్ భావిస్తారు. ఎవ‌రికి వారు ద్రోహానికి గుర‌య్యామ‌ని భావించి, ఇద్దరూ పోట్లాడుకుంటారు. అప్పటివరకూ ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ ఇద్దరు మిత్రుల న‌డుమ పోరు చూస్తే మ‌న‌సులు ద్రవిస్తాయి. చివ‌ర‌కు త‌మ పోరుకు కార‌ణం త‌మలోని స్నేహ‌మే అని భావిస్తారు. రామ్ ఉద్యోగ ధ‌ర్మంతోనే త‌న‌తో పోరాడాడు అని అర్థం చేసుకున్న భీమ్ స్నేహానికి క‌ట్టుబ‌డి లొంగిపోతాడు.

రామ్ త‌న‌ను బంధించ‌డం వ‌ల్ల అత‌ను ఉన్నత‌స్థానం చేరుకుంటాడ‌ని భీమ్ భావిస్తాడు. అలాగైనా బందీగా ఉన్న త‌మ జాతి అమ్మాయిని క‌లుసుకోవ‌చ్చున‌ని భావిస్తాడు. కానీ, ప్రభుత్వం భీమ్ కు ఉరిశిక్ష విధిస్తుంది. భీమ్ పోరాట ప‌టిమ గురించి మొద‌టి నుంచీ వింటున్న బ్రిటిష్ జెన్నీఫ‌ర్ కు కూడా ఈ విష‌యం తెలుస్తుంది. త‌న మిత్రుడు స్నేహం కోసం లొంగిపోతే, అత‌ణ్ని ఉరితీయ‌డం స‌రికాద‌నే వేదన రామ్ లో మొద‌ల‌వుతుంది. చిన్నత‌నంలోనే ప్రతి ఉద్యమ కారుడికీ ఆయుధాలను ఇస్తానని తండ్రికి చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. వృత్తి ధ‌ర్మం పాటిస్తూ భీమ్ కు అన్యాయం చేస్తున్నాన‌ని ఆలోచించలేద‌ని బాధ‌ప‌డ‌తాడు రామ్. ఓ ప‌థ‌కం ప్రకారం రామ్, భీమ్ ను, గోండు జాతి పాప‌ను ర‌క్షిస్తాడు. చిన్నత‌నం నుంచీ త‌న బావ రామ్ పై పంచ ప్రాణాలు పెట్టుకున్న సీత అత‌ను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నాడని ఆనందిస్తుంది. అయితే భీమ్ త‌ప్పించుకోవ‌డానికి కార‌ణం రామ్ అని, అత‌ణ్ని చిత్రహింస‌ల పాలు చేస్తుంటారు బ్రిటిష్ అధికారులు. ఓ సంద‌ర్భంలో భీమ్, సీత క‌లుసుకుంటారు. ఆ స‌మ‌యంలోనే పోలీస్ ఇన్ స్పెక్ట‌ర్ అయిన త‌న బావ రామ్ ను బ్రిటిష్ అధికారులు చిత్రహింస‌లు చేస్తున్నారని చెబుతుంది. మిత్రుడు భీమ్ ని రామ్ త‌ప్పించాడ‌నే తెల్లవాళ్ళు రామ్ ను చంప‌బోతున్నార‌ని చెప్పి విల‌పిస్తుంది. అప్పటి వరకూ రామ్ త‌న‌కు మిత్రద్రోహం చేశాడ‌ని భావించిన భీమ్ అస‌లు విష‌యం తెలుసుకోగానే స్నేహితుణ్ణి విడిపించేందుకు ప‌రుగు తీస్తాడు. ఆ క్రమంలో రామ్ కు గాయాలు అవుతాయి. రామ్ గాయాల‌ను మానటానికి భీమ్ తోడ్పడ‌తాడు.మల్లి కోసం త‌పించిన భీమ్, మట్టి కోసం తపించిన రామ్ చేతులు కలిపి తెల్లవారిని దేశం నుండి పార‌ద్రోలే ప్రయ‌త్నిస్తారు. విజృంభిస్తారు. బ్రిటిష్ వారి కీల‌క కేంద్రాల‌పై దాడులు సాగిస్తారు. ప‌రాయి పాల‌న నుండి దేశ‌మాత దాస్యశృంఖ‌లాల‌ను ఛేదించ‌డం కోసం రామ్, భీమ్ సాయం తో ఉద్యమ కారుల కోసం ఆయుధాలు సమకూర్చుకోవడంతో క‌థ ముగుస్తుంది.

ద‌ర్శకుని తీరు…
రాజ‌మౌళి ఏ సినిమా తీసినా, దానిని జ‌నం మెచ్చేలా చెక్కడానికి చాలా స‌మ‌యం తీసుకుంటార‌ని అంద‌రికీ తెలుసు. ‘ఆర్.ఆర్.ఆర్.’ రూప‌క‌ల్పన‌లోనూ అదే ప్రయ‌త్నం చేశారాయ‌న‌. క‌రోనా కార‌ణంగా జాప్యం జ‌రిగిన సందర్భాన్ని సైతం త‌మ ప్రాజెక్ట్ కు అనువుగా మ‌ల‌చుకున్నారాయ‌న‌. దాంతో ఆర్.ఆర్.ఆర్.ను మ‌రింత జ‌న‌రంజ‌కంగా మ‌లిచేందుకు ఈ సినిమాను ‘3డి’లోనూ రూపొందించారు. మామూలుగానే కొన్ని స‌న్నివేశాలు తెర‌పై చూస్తోంటే ఒళ్ళు గ‌గుర్పొడిచేలా ఉన్నాయి. ఇక త్రీడీలో ఆ ఎఫెక్ట్ మ‌రింత బాగా ఉంటుదని చెప్పవచ్చు. ముఖ్యంగా య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య ఇంట్రవెల్ కు ముందు చోటు చేసుకున్న పోరాట దృశ్యాలు చూప‌రుల‌కు ‘గూస్ బంప్స్’ తెప్పిస్తాయి. ఏ సినిమాలోనైనా ఫైట్ ను చూస్తే, ప్రేక్షకుల‌కు ఉత్సాహం, ఉద్రేకం క‌లుగుతాయి. కానీ, ఇందులో ఇద్దరు హీరోల మ‌ధ్య సాగే యాక్షన్ ఎపిసోడ్ ను చూస్తే వారి స్నేహ‌బంధం ఎక్కడ చెరిగిపోతుందోన‌నే ఆందోళ‌న ఓ వైపు, అలా జ‌ర‌గ‌రాద‌ని కోరుకొనే భావం మ‌రోవైపు క‌ల‌గ‌కుండా ఉండ‌వు. ఇక ‘బాహుబ‌లి’ రెండు భాగాల్లోలాగే ఇందులోనూ యాక్షన్ కు ప్రాధాన్యమిచ్చారు రాజ‌మౌళి. ప‌తాక స‌న్నివేశాల‌లో వ‌చ్చే పోరాటాలు, వ్యూహాలు సైతం ఆక‌ట్టుకొనేలా తెర‌కెక్కాయి. చిన్నక‌థ‌నైనా జ‌న‌రంజ‌కంగా మ‌ల‌చ‌డంలో దిట్ట రాజ‌మౌళి. ఆ విష‌యాన్ని ‘ఆర్.ఆర్.ఆర్.’తో మ‌రోమారు నిరూపించుకున్నారాయ‌న‌. ముఖ్యంగా జూనియ‌ర్ య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకొని వారి అభిమానులు ఎవ‌రూ నిరాశ చెంద‌కుండా ఉండేలా క‌థ‌ను న‌డిపిన తీరు ఆక‌ట్టుకుంటుంది. అలాగే ఒక‌రి పాత్ర ఎక్కువ‌, ఒక‌రి పాత్ర నిడివి త‌క్కువ అన్న ఆలోచ‌న రాకుండా ఆయ‌న జాగ్రత్త ప‌డ్డార‌నే చెప్పవ‌చ్చు. ఇత‌ర పాత్రధారుల‌తోనూ త‌న‌కు కావ‌ల‌సిన న‌ట‌న‌ను రాబ‌ట్టుకొని ర‌క్తి క‌ట్టించారు.

సాంకేతిక నైపుణ్యం…
త‌న సాంకేతిక నిపుణుల నుండి త‌న‌కు కావ‌ల‌సిన ఎఫెక్ట్ ను రాబ‌ట్టడంలోనూ భ‌ళా అనిపించారు రాజ‌మౌళి. ముఖ్యంగా క‌థ‌కు అనువైన విధంగా కె.కె.సెంథిల్ కుమార్ కెమెరా ప‌నిత‌నం క‌నిపిస్తుంది. ఆ స‌న్నివేశాల‌కు త‌గ్గ నేప‌థ్య సంగీత‌మూ వినిపించారు కీర‌వాణి. పాత్రోచిత‌మైన మాట‌ల‌తో బుర్రా సాయిమాధ‌వ్ కూడా ఆక‌ట్టుకున్నారు.

పాత్రల తీరు…
కొమ‌రం భీమ్ గా జూ.య‌న్టీఆర్, రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్ న‌టించ‌లేదు, ఆ పాత్రలే క‌నిపించేలా అభిన‌యించారు. ఇద్దరూ పోటాపోటీగా త‌మ పాత్రల‌ను నిర్వహించార‌ని చెప్పవ‌చ్చు. సినిమాను బాగా గ‌మ‌నిస్తే ఇందులోని ప్రధాన పాత్రల నేప‌థ్యంలో పంచ‌భూతాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. గోండు జాతి ప‌సిపాప నింగి అయితే, రామ‌రాజు పాత్రలో అగ్ని, భీమ్ పాత్రలో జ‌లం క‌నిపిస్తాయి. ఇక రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా ఫ్లాష్ బ్యాక్ లో క‌నిపించే అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర వాయువును పోలి ఉంటుంది. రామ‌రాజు కోసం త‌పించే సీత పాత్రలో భూమి క‌నిపిస్తుంది. ఇలా మ‌ల‌చిన ర‌చ‌యిత‌ల‌ను, వాటిని అదే తీరున తెర‌కెక్కించిన ద‌ర్శకుణ్ణి అభినందించి తీరాలి. జ‌లంలోని గ‌ల‌గ‌ల‌, స‌హ‌నం, విజృంభ‌ణ అన్నీ మిళిత‌మైన భీమ్ పాత్రలో య‌న్టీఆర్ అందుకు త‌గ్గ అభిన‌యాన్ని ప్రతీసారి ప్రద‌ర్శించారు. ఇక అగ్నిలోని కాంతి, తీక్షణం స‌రితూగేలా రామ‌రాజు పాత్రలో రామ్ చ‌ర‌ణ్ న‌టించారు. సీత పాత్ర నిడివి త‌క్కువే అయినా అలియా భ‌ట్ ప‌రిమితి మేర‌కు న‌టించింది. రామ‌రాజుకు స్పూర్తి కలిగించిన తండ్రి గా అజ‌య్ దేవ‌గ‌ణ్ త‌న‌దైన అభిన‌యం చూపించారు. శ్రియ పాత్ర నిడివి మ‌రీ చిన్నది. జెన్నీఫ‌ర్ గా న‌టించిన ఒలివియా మారిస్ క‌నిపించినంత సేపూ ఆక‌ట్టుకుంది. రాహుల్ రామ‌కృష్ణ భీమ్ మిత్రునిగా ఒదిగిపోయాడు. స‌ముతిర ఖ‌ని వంటి న‌ట‌ద‌ర్శకుణ్ణి అంత‌గా ఉప‌యోగించుకోలేదనిపిస్తుంది. పాన్ ఇండియా మూవీ కాబ‌ట్టి, త‌మిళ‌నాడుకు చెందిన సముతిర‌ఖ‌ని ఉంటే బాగుంటుంద‌ని భావించారేమో!

ప‌రిశీల‌న‌…
తొలి నుంచీ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీమ్ పాత్రల నేప‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్. మూవీ క‌థ రూపొందింద‌ని సూచించడంతో ప్రేక్షకులు త‌మ ఊహ‌లతో ఈ చిత్ర క‌థ‌ను ఎవ‌రికి వారు మ‌ల‌చుకున్నారు. గ‌తంలోనూ బాహుబ‌లిని క‌ట్టప్ప ఎందుకు చంపాడు? అన్న సందేహాన్ని మిగిల్చి రెండోభాగంపై అంద‌రిలోనూ అమితాస‌క్తి క‌లిగించి, ఎవ‌రి ఊహ‌ల్లో వారిని తిరిగేలా చేసి, చివ‌రకు త‌న‌దైన మార్కుతో క‌థ‌ను చూపించారు. అదే టెక్నిక్ ను రాజ‌మౌళి ఈ సినిమా విష‌యంలోనూ ప్రద‌ర్శించారు. ఎన్నడూ క‌లుసుకోని రామ‌రాజు, భీమ్ ఎలా ఈ క‌థ‌లో క‌లుసుకున్నారో జ‌నం ఎంత‌గానో ఊహించుకున్నారు. జ‌క్కన్న మాత్రం తాను చెప్పిన‌ట్టుగానే ఈ చిత్రక‌థ‌కు అల్లూరికి, కొమ‌రం కు ఏ సంబంధ‌మూ లేద‌నే చూపించారు. ముందుగా రామ్ పాత్ర ప్రవేశిస్తుంది. త‌రువాత భీమ్ క‌నిపిస్తాడు. ఇద్దరి ఇంట్రడక్షన్ సీన్స్ క‌నువిందు చేసేలా తెరకెక్కాయి. కొమ‌రం భీముడో... పాట స‌మ‌యంలో య‌న్టీఆర్ అభిన‌యం ఎవ‌రినైనా క‌ట్టిప‌డేస్తుంది. ఇక ఇద్దరు హీరోలు ఎవ‌రికీ ఎవ‌రు ఏ మాత్రం త‌గ్గమ‌ని పాట‌ల్లోనూ ప‌స చూపించారు.

పాట‌ల ప‌ర్వం…
ఇందులోని ఆరు పాట‌ల‌నూ సంద‌ర్భోచితంగానే తెర‌పై ప్రద‌ర్శించార‌నిపిస్తుంది. సీతారామ‌శాస్త్రి క‌లం నుండి జాలువారిన ”దోస్తీ…” పాట తెర‌పై రామ్, భీమ్ స్నేహ‌బంధాన్ని బ‌ల‌ప‌రుస్తూ సాగింది. ఇక ఇంగ్లిష్ వారికి త‌మ ‘నాటు’ డాన్సులోని ఘాటు ఏ పాటితో చూపించే ప్రయ‌త్నంలో రూపొందిన ”నాటు నాటు…” పాట‌లో చంద్రబోస్ ప‌లికించిన పదాల‌కు అనువుగానూ డాన్స్ కొరియోగ్రఫి సాగింది. భీమ్ ని అరెస్ట్ చేసే నేప‌థ్యంలో త‌రువాతి ప‌రిణామాల‌తో సాగే సుద్దాల అశోక్ తేజ్ ప‌లికించిన ”కొమ‌రం భీముడో… ” పాట చూపు తిప్పుకోకుండా చేస్తుంది. దేశ‌మాత‌పై అభిమానం పెంచేలా ఫ్లాష్ బ్యాక్ లో చిత్ర సంగీత ద‌ర్శకుడు కీర‌వాణి రాసిన ”జ‌న‌నీ… ” గీతం ఆక‌ట్టుకుంటుంది. రామ‌రాజు కోలుకుని అల్లూరి సీతారామ‌రాజులా క‌నిపించే నేప‌థ్యంలో శివ‌శ‌క్తి ద‌త్త ప‌లికించిన ”రామ‌మ్…రాఘ‌వ‌మ్… ” రూపొందింది. ఇంత‌కు ముందు తాను తీసిన మ‌గ‌ధీర‌ చిత్రంలో ఎండ్ టైటిల్ కార్డ్స్ ప్లే అయ్యే స‌మ‌యంలో ఓ పాట‌తో ఆక‌ట్టుకున్నారు రాజ‌మౌళి. అదే విధంగా ఈ సినిమా ముగింపులో ”ఎత్తర జెండా…” అంటూ సాగే రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చ‌న క‌నిపిస్తుంది. మ‌గ‌ధీర‌లో లాగే ఈ పాట‌లో న‌టీన‌టులతో పాటు దర్శకుడు రాజమౌళి క‌నిపిస్తారు. ముందుగానే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌డంతో ఇప్పటికే జ‌నాల నోళ్ళలో ఇవి నానుతున్నాయి. వాటిని రాజ‌మౌళి త‌న‌దైన ముద్రతో తెర‌పై ఆవిష్కరించ‌డం మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంద‌ని చెప్పవ‌చ్చు.

నిజానికి ఇద్దరు స్టార్ హీరోస్ తో రూపొందిన అస‌లు సిస‌లు మల్టీస్టార‌ర్ ఎన్నో ఏళ్ళ త‌రువాత ‘ఆర్.ఆర్.ఆర్.’ రూపంలో వ‌చ్చింద‌ని చెప్పవ‌చ్చు. ఇందులో య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఏమాత్రం నిరాశ చెంద‌కుండా వారి పాత్రల‌ను మ‌ల‌చిన తీరు అభినంద‌నీయం. మ‌ల్టీస్టార‌ర్స్ జ‌నానికి న‌చ్చితే ఎవ‌రి అభిమానులు వారు ప‌దే ప‌దే చూస్తూ ఉంటారు. ఏ మాత్రం న‌చ్చక పోయినా, అటు వైపు మ‌ళ్ళీ వెళ్ళరు. కానీ, ఈ సినిమాకు రాజ‌మౌళి బ్రాండ్ పెద్ద ఎస్సెట్. కాబ‌ట్టి రాజ‌మౌళి సినిమా అన్న ఉద్దేశంతో ‘ట్రిపుల్ ఆర్’ను జ‌నం త‌ప్పకుండా ఒక్కసారైనా చూస్తారు. ఇక త‌మ హీరోల అభిన‌యం, వారికి చిత్రంలో ఉన్న స‌న్నివేశాలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటే ఈ సినిమాను ఫ్యాన్స్ ప‌దే ప‌దే చూసే అవ‌కాశం ఉంది. ఎంత అనుకున్నా ఈ సినిమా నిడివి మాత్రం ప్రేక్షకుల‌కు ప‌రీక్ష అనే చెప్పాలి. ఆ నిడివి వల్ల, రిపీట్ ఆడియ‌న్స్ త‌గ్గే అవ‌కాశం ఉండవచ్చు. అయితే ఇప్పటి దాకా త‌న చిత్రాల‌తో ప‌లు సెంటిమెంట్స్ ను అధిగ‌మించిన రాజ‌మౌళి ఈ సినిమా నిడివితోనూ ఆక‌ట్టుకుంటార‌ని భావించ‌వ‌చ్చు.

రేటింగ్: 3/5

ప్లస్ పాయింట్స్:

మైన‌స్ పాయింట్స్:

ట్యాగ్ లైన్: రోరింగ్ ‘ఆర్.ఆర్.ఆర్.’