గత యేడాది ఇదే ఫిబ్రవరి నెల 21న విడుదలైన ‘భీష్మ’ మూవీ నితిన్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఆ తర్వాత కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఆ సినిమా సూపర్ హిట్ రేంజ్ కు వెళ్ళకుండానే ఆగిపోయింది. అయితే దాని కంటే ముందే నితిన్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే లాస్ట్ ఇయర్ నితిన్ నటించిన మూడు నాలుగు సినిమాలు విడుదలై ఉండేవి. కానీ కరోనా దెబ్బ కొట్టేసింది. దాంతో అవన్నీ ఇప్పుడు వరుస కట్టబోతున్నాయి. అందులో ముందుగా వచ్చిన సినిమా ‘చెక్’. తొలి చిత్రం ‘ఐతే’ నుండి తనదైన శైలిలో సినిమాలు తీస్తూ వస్తున్నాడు డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. తొలిసారి నితిన్ – చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లో ‘చెక్’ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ అధినేత వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.
కథ విషయానికి వస్తే… 40 మంది మరణానికి కారకుడైన టెర్రరిస్ట్ ఆదిత్య (నితిన్)కు ఉరిశిక్ష పడుతుంది. చేయని నేరానికి తనను బంధించారంటూ అతను వాపోతుంటాడు. ఆదిత్య తరఫున వాదించడానికి లాయర్ మానస (రకుల్ ప్రీత్ సింగ్) ముందుకొస్తుంది. కానీ ఆదిత్య తన ప్రేయసి యాత్ర (ప్రియా ప్రకాశ్ వారియర్) విషయంలో చెప్పిన సంఘటనల్లో పొంతన లేకపోవడంతో అర్థంతరంగా ఆ కేసు నుండి తప్పుకుంటుంది. జైలులో పరిచయం అయిన చెస్ ఛాంపియన్ శ్రీమన్నారాయణ (సాయిచంద్) సాయంతో ఆదిత్య ఎలా జైలు గోడల నుండి బయటకు వచ్చాడన్నదే మిగతా కథ.
చంద్రశేఖర్ యేలేటి సినిమా అనగానే సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందనే భావన సాధారణ ప్రేక్షకుడిలోనూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఈసారి చందు జైల్ డ్రామాను ఎంపిక చేసుకున్నాడు. తన మీద పడిన టెర్రరిస్ట్ అనే ముద్రను చెరిపేసుకోవడం కోసం హీరో చెస్ ను ఆశ్రయించడం, అంచెలంచెలుగా గెలిచి గ్రాండ్ మాస్టర్ గా నిలవడం ఇదంతా ఆసక్తిని కలిగించే అంశమే. కథంతా జైలు గోడల మధ్య సాగే క్రమంలో ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా ఆసక్తికరంగా కొన్ని సన్నివేశాలను దర్శకుడు మలిచాడు. హీరో, హీరోయిన్ల పై పిక్చరైజ్ చేసిన లవ్ ట్రాక్, సాగర తీరంలో చిత్రీకరించిన పాట ప్రథమార్ధంలో ఆడియెన్స్ కు చక్కని రిలీఫ్ ను ఇస్తాయి. అలానే హీరో క్యారెక్టరైజేషన్ కూడా రొటీన్ కు భిన్నంగా ఉంది. ఇక ద్వితీయార్ధానికి వచ్చే సరికీ జైలు, కోర్టు డ్రామాతోనే మూవీ సాగుతుంది. ప్రేక్షకుల ఊహకందని విధంగా సినిమాకు ముగింపు పలకడమే కాదు… దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు చందు చెప్పకనే చెప్పాడు. నిజానికి ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ ను తీసేప్పుడు దర్శకులు అంతగా లాజిక్కుల జోలికి పోరు. అలా కొన్ని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా ఉన్నాయి. కోర్టు ఆవరణలో జడ్జి గారి మనవరాలు ఓ టెర్రరిస్టుతో చెస్ ఆడటం కూడా ఓ రకంగా అలాంటిదే! ఇక ప్రధాన పాత్రల మధ్య అనుబంధం కూడా బలంగా లేదు. ఒకరి కోసం ఒకరు ఎందుకు పనిచేస్తారనే విషయాన్ని దర్శకుడు ఎక్కడా కన్వెన్సింగ్ గా చూపించలేదు. సినిమాలోని టెంపో అక్కడక్కడా డ్రాప్ అవడం మనకు కనిపిస్తూనే ఉంటుంది. ద్వితీయార్థంలో అది మరీ ఎక్కువగా ఉంది. పోరాట సన్నివేశాలు సైతం మరీ ఎక్కువ నిడివి ఉండి చికాకు పుట్టిస్తాయి. యాక్షన్ సీన్స్ మీద చూపించిన శ్రద్ధ దర్శకుడు కథ మీద చూపించి ఉంటే బాగుండేది.
ఇక నటీనటుల విషయానికి వస్తే… నితిన్ కు ఇది ఖచ్చితంగా భిన్నమైన పాత్ర. దానిని అతను చక్కగా పోషించాడు. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఆ మూడ్ ను మెయిన్ టైన్ చేశాడు. ఇక ప్రియా ప్రకాశ్ వారియర్ కు ఉన్న స్క్రీన్ స్పేస్ తక్కువే. కానీ ఆమె తన తొలి తెలుగు సినిమాతోనే ఫర్వాలేదనిపించుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర ప్రారంభంలో కాస్తంత డల్ గా ఉన్నా, ద్వితీయార్ధంకు వచ్చేసరికీ సినిమాకు దన్నుగా నిలిచింది. రకుల్ తండ్రిగా పోసాని రొటీన్ పాత్రనే చేశారు. చెస్ మాస్టర్ గా సాయిచంద్, జైల్ అధికారులుగా మురళీశర్మ, సంపత్ రాజ్; హర్షవర్ధన్, సిమ్రాన్ చౌదరి, చైతన్య కృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో చక్కని నటన కనబరిచారు. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మాణ విలువలకు ప్రాధాన్యమిచ్చింది. మొత్తం మీద రొటీన్ కు భిన్నంగా ‘చెక్’ను చంద్రశేఖర్ యేలేటి తీసే ప్రయత్నం చేసినా, సమ్ థింగ్ మిస్సింగ్ అనే భావన థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడికి కలుగుతుంది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయ్యి, దీనికి సీక్వెల్ వస్తే… ఆ లోటు ఏమైనా తీరుతుందేమో చూడాలి.
బట్… ఓవర్ ఆల్ గా వన్ టైమ్ వాచ్ మూవీగా ‘చెక్’ను చెప్పుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ
అలరించే మాటలు
మైనెస్ పాయింట్స్
సినిమా రన్ టైమ్
అక్కడక్కడా బోర్ కొట్టించే సీన్స్
రేటింగ్
2.5 / 5
ట్యాగ్ లైన్
‘చెక్’ చెప్పడం సులువు కాదు!